Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 61 కోట్ల మందికి పైగా విద్యార్థులపై ప్రతికూల ప్రభావం
- అట్టడుగు వర్గాలకు తీవ్ర నష్టం : యునిసెఫ్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే, ఈ మహమ్మారి విద్యాసంస్థల పైనా తీవ్ర ప్రభావం చూపింది. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిస్థితి కారణంగా దాదాపు 61.60 కోట్ల మంది విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. విద్యాసంవత్సరాన్ని కోల్పోయినవారు తమ కంటే చిన్నవారితో నేర్చుకుంటున్నారని వివరించింది. ముఖ్యంగా, అట్టడుగు వర్గాల చిన్నారులు ''తీవ్ర నష్టాన్ని'' ఎదుర్కొన్నారని తెలిపింది. బడుల మూసివేత కారణంగా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లోని పదేండ్ల వయసున్న 70 శాతం మంది చిన్నారులు సాధారణ పదాలనూ చదవడం, అర్థం చేసుకోలేకపోతున్నారని యునిసెఫ్ తెలిపింది. కరోనా మహమ్మారి పరిస్థితులకు ముందు ఇది 53 శాతంగా ఉన్నదని వివరించింది. 37 కోట్ల మంది చిన్నారులు పాఠశాల భోజనాలను మిస్సయ్యారని తెలిపింది. భారత్లోని చిన్నారుల పైనా ఇది విపత్కర పరిణామాలను చూపెట్టిందని తెలిపింది. గతేడాది మార్చిలో యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లోని ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు మాత్రమే ఆన్లైన్ విద్యలో డిజిటల్ డివైజ్లను, ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందగలుగుతున్నారు.