Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీని కలిశాకే... పూర్తి అయిన లావాదేవీలు
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌నకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. దీంతో ఎయిర్ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీలు పూర్తి అయ్యాయి. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ ఎఐఏహెచ్ఎల్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపు 69 ఏండ్ల తరువాత సుప్రసిద్ధ 'మహారాజా'ను ఇక పూర్తిగా టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. శుక్రవారం నుంచి ఎయిర్ ఇండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. టాటా సన్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ నుంచి 2,700 కోట్లను ప్రభుత్వం స్వీకరించడం, 15,300 రుణాన్ని నిలుపుకోవడంతో ఎయిర్ ఇండియా (100 శాతం ఎయిర్ ఇండియా షేర్లు, దాని అనుబంధ సంస్థ ఎఐఎక్స్ఎల్, ఎఐఎస్‌ఏటీఎస్ 50 శాతం షేర్లు) వాటాలను వ్యూహాత్మక భాగస్వామి టాటా గ్రూప్‌కు బదిలీ చేయడం జరిగింది.గురువారం ఉదయం ఎయిర్ ఇండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూప్‌నకు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. బదిలీ ప్రక్రియకు ముందు టాటా సన్స్ చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్, ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. అంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయం ఎయిర్‌లైన్స్ హౌస్‌కు చేరుకుని కార్యకలాపాలు చక్కపెట్టారు. ఎయిర్ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ అత్యధిక ధర రూ.18 వేల కోట్ల బిడ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత 11 అక్టోబర్ 2021న బిడ్డర్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయింది. ఎయిర్ ఇండియా బిడ్ ను టాటా సన్స్ అనుబంధ సంస్థ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. ఎయిర్ ఇండియా అమ్మకానికి రూ.18 వేల కోట్లకు టాటా గ్రూప్‌తో ప్రభుత్వం 25 అక్టోబర్ 2021న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్(ఎస్ పి ఎ)పై సంతకాలు చేసింది. ఆ తరువాత టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా, ప్రభుత్వం షేర్ కొనుగోలు ఒప్పందంలో రూపొందించిన షరతుల సమితిని, యాంటీ ట్రస్ట్ బాడీలు, రెగ్యులేటర్లు, రుణదాతలు, మూడు పార్టీలను సంతృప్తి పరిచే దిశగా పనిచేశాయి.ఎయిర్ ఇండియా సంస్థను 1932లో టాటా గ్రూప్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్ వాటాను కలిగియుండే సంస్థగా టాటా గ్రూప్ నిలుస్తుంది. విస్తారాలో 51 శాతం, ఎయిర్ ఆసియాలో 84 శాతం వాటాను టాటా గ్రూప్ కలిగి ఉంది. ఎయిరిండియా 101 డెస్టినేషన్స్‌కు విమానాలను నడుపుతుంది. దేశీయంగా 57 గమ్య స్థానాలకు వైమానిక సేవలను అందిస్తోంది. నాలుగు ఖండాల్లోని 33 దేశాలకు కూడా సేవలందిస్తోంది.
సంతోషంగా ఉంది: ఎన్. చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మెన్
ఎయిర్ ఇండియా అప్పగింత ప్రక్రియ పూర్తి అయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్ చైర్మెన్ ఎన్. చంద్రశేఖరన్ అన్నారు. టాటా గ్రూప్‌లోకి ఎయిర్ ఇండియా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని, ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను రూపొందించడానికి అందరితో కలిసి నడవడానికి ఎదురు చూస్తున్నామని అన్నారు.
ముగిసిన పెట్టుబడుల ఉపసంహరణ : తుహిన్ కాంత్ పాండే
ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) చైర్మెన్ తుహిన్ కాంత్ పాండే అన్నారు. ఎయిర్ ఇండియా కొత్త యజమాని తలేస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు షేర్లు బదిలీ చేయబడ్డాయని తెలిపారు.