Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదోనిలో బీజేపీ ఘాతుకం
- ఇద్దరు వైసిపి కార్యకర్తలు మృతి
ఆదోని : బీజేపీ నేతలు దారుణానికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఇద్దరు వైసీపీ నాయకులను హత్య చేశారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పెట్రోల్, యాసిడ్ స్ప్రే చేసి, కళ్లలో కారం పొడి చల్లి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... కామవరం గ్రామంలో ఆదోని పట్టణానికి చెందిన బోయ మునేంద్ర రాజ్‌కుమార్‌కు చెందిన సర్వే నంబర్ 254/ఉ లో నాలుగు ఎకరాలు, సర్వే నంబర్ 254/అ లో మూడు ఎకరాలు ఉంది. ఈ భూమిని 22 ఏళ్ల క్రితం గ్రామంలో నివాసం ఉంటున్న వడ్డే రామాంజి, వడ్డే రాజు, వడ్డే మల్లికార్జున, వడ్డే ఈశ్వర్, వడ్డే గోపాల్‌కు అమ్మినట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపో డంతో వివాదానికి దారి తీసింది. ఈ విషయంపై ఇరు గ్రూపులు కోర్టుకు వెళ్లాయి. కోర్టు తీర్పు మునేంద్రరాజ్కుమార్కు అనుకూలంగా వచ్చింది. వైసిపి మండల నాయకుడు మహేందర్‌రెడ్డి,వడ్డే ఆంజనేయుల మధ్య పొలం పంచా యితీ వచ్చింది.ఈ విషయాన్ని ఇటీవల బిజెపిలో చేరిన వడ్డే గోపాల్ స్థానిక విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి.. మహేందర్‌రెడ్డి భూకబ్జాలు మానుకోవాలని, తమ భూమి పంచాయితీలో తలదూర్చవద్దని హెచ్చరించారు. ఎటువంటి సంబంధమూ లేని తమ నాయకునిపై ఆరోపణలు ఎలా చేస్తారని గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శివప్ప (45), ఈరన్న (47), సత్యప్ప, అయ్యప్ప, బజారప్ప, పెద్ద తిమోతి, ఇస్మాయిల్‌తో పాటు మరికొంతమంది గోపాల్ ఇంటికి వెళ్లి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పక్కా ప్రణాళికతో దాడి చేయాలని సిద్ధమయ్యారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇంటి వద్దకు రాగానే పెట్రోల్, యాసిడ్, కళ్లల్లో కారం పొడి చల్లి, వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శివప్ప, ఈరన్న అక్కడికక్కడే మరణించారు.