Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఐలో మహిళల నియామకపు క్రమాన్ని దెబ్బతీస్తున్న నిబంధనలు
- తక్షణమే ఉపసంహరించాలని సీఐటీయూ డిమాండ్
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తపన్‌సేన్ లేఖ
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మహిళల నియామకంలో లింగ వివక్షతను అంత మొందించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు ఆమెకు ఒక లేఖరాశారు. మహిళల నియమించడా నికి సంబంధించి విధించిన కొత్త వైద్య ప్రమాణాలు దిగ్భ్రాంతి కలిగించేలా వున్నాయని, వివక్షతో కూడి వున్నాయని తపన్‌సేన్ విమర్శించారు.
ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాల ప్రకారమే ఉద్యోగాలకు ఎంపికైనా సర్వీస్‌లో చేరే సమయంలో సదరు మహి ళ మూడు మాసాల గర్భవతిగా వుంటే అటువంటి వారిని చేర్చుకోరాదని పేర్కొంటూ ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్) ఓం ప్రకాష్ మిశ్రా కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. అటువంటి మహిళ ను తాత్కాలికంగా అన్‌ఫిట్‌గా పరిగణించి, డెలివరీ అయిన నాలుగు మాసాల్లోగా చేరడానికి అనుమతిం చాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. ఈ మార్గదర్శకాల వల్ల మహిళల సర్వీసు, వారి ప్రయోజనాలు దెబ్బ తింటాయని తపన్‌సేన్ పేర్కొన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ ఆదేశాల్లో తీవ్రమైన లింగ వివక్షత ప్రదర్శితమవుతోందని అన్నారు. భారత రాజ్యాంగం హామీ కల్పించిన సమానత్వం అవకాశాలను ఉల్లంఘిస్తోందని అన్నారు. గర్భధారణ, పిల్లల పెంపకమనేది మహిళ సహజసిద్ధమైన స్వభావమని, సామాజిక పునరుత్పత్తి క్రమానికి దోహదపడేదని, దేశ ప్రగతికి దోహదపడడమే కాదు, జీతం భత్యం లేని పని చేయడం ద్వారా స్థూల దేశీయోత్పత్తికి కూడా సహాయపడుతున్నారని అన్నారు. దేశంలోనే ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్బీఐ ఇటువంటి వివక్షను ప్రదర్శించడం తీవ్రమైన సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇలా వ్యవహరిస్తే ఇక మహిళా సాధికారతకు, సమానత్వానికి ప్రభుత్వం ఏ విధంగా నిబద్ధతతో వున్నట్లని విస్మయం వ్యక్తం చేశారు.
ఇటువంటి ఆదేశాల ఫలితంగా పురుషులతో సమానంగా అన్నింటా పోటీ పడి సెలక్ట్ అయిన మహిళలు వారి తప్పేమీ లేకున్నా ఇలా నిషేధానికి గురవడం విచారకరమని అన్నారు. దీనివల్ల వారికి దక్కాల్సిన సీనియారిటీ దెబ్బతింటుందని, వారి ఆదాయాలు దెబ్బతింటాయని అన్నారు. ఫలితంగా మొత్తం సర్వీస్ అంతా ప్రభావితమవుతుందన్నారు. ఇది ఘోరమైన వివక్ష కాకపోతే మరేంటని ప్రశ్నించారు. 2009లో కార్మిక సంఘాలు, బ్యాంక్ యూనియన్లు తీసుకువచ్చిన ఒత్తిళ్ళతో, అప్పటి సీఐటీయూ అధ్యక్షుడు ఎం.కె.పాండే జోక్యంతో ఎస్బీఐ ఇటువంటి సిగ్గుమాలిన, వివక్షాపూరితమైన విధానాన్ని నిలిపివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని తపన్‌సేన్ తెలిపారు. ఆనాడు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చొరవతోనే అది పరిష్కారమైందని, ఇప్పుడు కూడా అదే రీతిన చొరవ తీసుకుని ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరిం చేలా చూడాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు.