Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక అంతరాలను తగ్గించాలి : బడ్జెట్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో అంతరాలను తగ్గించేలా కేంద్ర బడ్జెట్ ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఉద్యోగాలు సృష్టించేలా, వృద్థి పెరిగేలా వచ్చే బడ్జెట్లో దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. విద్యా, వైద్య, మౌలిక వసతుల రంగాలకు కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ రంగంపై పన్నులు తగ్గించాలన్నారు. '' ప్రతీ బడ్జెట్‌ను వృద్థిని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. అందులో ఇదీ ఒక్కటైనప్పటికీ ఈ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ఆర్థిక వ్యవస్థలో అంతరాలను తగ్గించేలా దృష్టి సారించాలి'' అని దువ్వూరి ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. కరోనా సంక్షోభం స్వల్ప ఆదాయాలు కలిగిన వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేసిందన్నారు. కాగా.. అధిక ఆదాయాలు కలిగిన వారి పొదుపు, సంపద పెరిగిందన్నారు. ఇటీవలి 'వరల్ట్ ఇనీక్వాలిటీ రిపోర్ట్'లో భారత్ సహా అనేక దేశాల్లో అంతరాలు పెరిగాయని స్పష్టమైంది. ఇది దీర్ఘకాల వృద్థికి విఘాతమని దువ్వూరి హెచ్చరించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దువ్వూరి ఈ వ్యాఖ్యలు చేశారు.
''ఉద్యోగ ఆధారిత వృద్థి దేశానికి అవసరం. బడ్జెట్ రూపకల్పన ఆ విధంగా ఉండాలి. ఉద్యోగాలను కల్పించగలిగాలి.'' అని దువ్వూరి పేర్కొన్నారు. వృద్థి నెమ్మదిస్తే ఉద్యోగాలు ప్రమాదంలో పడుతాయన్నారు. ఎగుమతులు మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ద్రవ్య లోటు చెల్లింపులకు సరిపడ లేవన్నారు. ఉపాధి ఆధారిత ఎగుమతుల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సూచీ పేదలపై మరింత భారాన్ని మోపుతుందన్నారు. ధరల పెరుగుదల ప్రమాద ఘంటికలను మోగిస్తుందన్నారు. ద్రవ్యోల్బణ సూచీని తగ్గించే విధంగా ఆర్బిఐ విధానం ఉండాలన్నారు. 2021 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 5.59 శాతానికి, టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) 13.56 శాతానికి ఎగిసిన విషయం తెలిసిందే.