Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు :
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకులు యడియూరప్ప మనవరాలు డాక్టర్ సౌందర్య (30) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని వసంతనగర్‌లో ఉన్న ఆమె నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. యడియూరప్ప ద్వితీయ కుమార్తె పద్మావతి కూతురైన సౌందర్యకు 2018లో నీరజ్‌తో వివాహమైంది. వీరు ఇరువురు బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. సౌందర్య రేడియోలిజిస్టుగా పనిచేస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం..శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌందర్య భర్త నీరజ్ విధులకు వెళ్లారు. ఆ సమయంలో పనిమనిషి, 9 నెలల కుమారుడితో సౌందర్య ఇంట్లోనే ఉన్నారు. భర్త బయటకు వెళ్లిపోయిన తర్వాత తన గదికి వెళ్లిన సౌందర్య తలుపు వేసుకుంది. అల్పాహారం ఇచ్చేందుకు పనిమనిషి డోర్ కొట్టగా.. ఎంతకూ తలుపు తీయకపోవటంతో ఆమె నీరజ్ కు ఫోన్ చేసింది. 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన నీరజ్ తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా సౌందర్య ఉరికి వేలాడుతూ కన్పించింది. వెంటనే దగ్గర్లోని మల్లిగే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. సౌందరయ్య మెడపై చిన్నచిన్న గాయాలు మినహా తీవ్ర గాయాలేవీ లేవని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ సతీష్ ప్రకటించారు. స్థానిక తహశీల్దార్ శనివారం ఉదయం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అనంతరం సోలదేవనహల్లిలోని నీరజ్ ఫామ్ హౌజ్‌కు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నీరజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
9 నెలల కుమారుడున్న సౌందర్య పోస్ట్ ప్రెగెన్సీ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భార్యభర్తల మధ్య గొడవలేమీ లేవని సమాచారం. వారి మధ్య గొడవలు ఉంటే యడియూరప్ప కుటుంబ సభ్యులు నేరుగా నీరజ్ ఇంటికి వెళ్లి ఆయన నివాసం వద్దనే మతదేహాన్ని ఉంచే అవకాశం లేదని బంధువర్గాలు చెబుతున్నాయి. సౌందర్య పోస్టుమార్టం ప్రక్రియ ముగ్గురు వైద్యుల సమక్షంలో సీసీ కెమెరాల నడుమ చేపట్టినట్లు డాక్టర్ సతీష్ వెల్లడించారు. గొంతు భాగంలో గాటు తప్ప శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. గదిలో సూసైడ్ నోటు కూడా లేకపోవటంతో ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.
ప్రధాని, సిఎం సంతాపం
సౌందర్య మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. యడియూరప్పకు ఫోన్ చేసి ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బొమ్మై, పలువరు మంత్రులు, కాంగ్రెస్ స్థానిక నేతలు నివాళులర్పించారు.