Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లోకాయుక్త సవరణపై కొడియేరి
తిరువనంతపురం: మంత్రుల తొలగింపునకు సిఫారసు చేసే అధికారం లోకాయుక్త నుంచి ఉపసంహరించే అంశంపై కొన్ని స్వార్థపర, రాజకీయ శక్తులు, వాటి అధీనంలోని మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ అన్నారు. అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలనను అందిస్తున్న ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై ఇవి మూకుమ్మడిగా దుష్ప్రచారం సాగిస్తున్నాయని దేశాభిమానిలో రాసిన వ్యాసంలో కొడియేరి పేర్కొన్నారు.
లోకాయుక్త ను ఏర్పాటు చేసిందే తాము, అలాంటిది తామెందుకు దానిని బలహీనపరుస్తామని ఆయన అన్నారు. 1999లో నయనార్ ప్రభుత్వమే లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చింది. తొలి పినరయి ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్ ఇచ్చిన న్యాయ సలహా మేరకే ఈ సవరణ అవసర మైందన్నారు.. కేరళ లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 14 రాజ్యాం గంలోని ఆర్టికల్ 164కి అనుగుణంగా లేదని న్యాయ నిపుణులు సూచించారని అన్నారు. మంత్రుల తొలగింపునకు సిఫారసు చేసే అధికారం లోకాయుక్తకు కల్పిస్తున్న ఈ అప్రజాస్వామిక నిబంధనను తొలగించేందుకు సవరణ అవసరమైంది. కేంద్ర ప్రభుత్వ నియంతత్వ పట్టును నిరోధించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందని నిష్పాక్షిక, ప్రజాతంత్రయుత మేధావులు, ఆలోచనాపరులు, రచయితలు పలువురు సమర్థిస్తున్నారని అన్నారు. కీలకమైన ఈ విషయాన్ని మీడియా ఉద్దేశపూర్వకంగానే మరుగుపరచడం దారుణమని ఎన్ఎస్ మాధవన్ వంటి సీనియర్ ఐఎఎస్ అధికారులు పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. అందువల్లే లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 14ని తొలగిస్తూ మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపిందన్నారు. .కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలు, నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న దుస్థితి చూస్తున్నామని ఈ నేపథ్యంలోనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చిందన్నారు. సవరణ ఆర్డినెన్స్‌పై సంతకం చేయవద్దని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ నేతత్వంలోని యుడిఎఫ్, బిజెపి గవర్నరుపై ఒత్తిడి తేవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పుడున్న చట్టం ఆదర్శప్రాయమైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దీనిని ఎందుకు అమలు చేయడం లేదు అని కొడియేరి ప్రశ్నించారు.