Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల బాండ్లతో వేల కోట్లు పోగేసుకున్న వైనం
- ప్రకటిత ఆస్తులే రూ.4848 కోట్లు
- తదుపరి స్థానాల్లో బిఎస్పి, కాంగ్రెస్
- ఎడిఆర్ విశ్లేషణలో వెల్లడి
న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలన్నింటికన్నా బిజెపి అత్యంత ధనిక పార్టీగా నిలిచింది. క్రోనీ కార్పొరేట్ల నుంచి భూరి విరాళాలు పోగేసుకునేందుకు మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు బిజెపికి వేలాది కోట్లు కుమ్మరించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిజెపి అధికారికంగా ప్రకటించిన ఆస్తుల విలువే రూ.4,847.78 కోట్లుగా ఉంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన పార్టీల కంటే అనేక రెట్లు బిజెపి ఆస్తులుండటం గమనార్హం. బిజెపి తర్వాతి స్థానంలో రూ.698.33 కోట్లతో బిఎస్పి నిలిచింది. మూడో స్థానంలో రూ.588.16 కోట్లతో కాంగ్రెస్ ఆస్తులున్నాయి. ఎన్నికల సంస్కరణల కోసం పోరాడే గ్రూపు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఈ వివరాలను శక్రువారం విడుదల చేసింది.
2019-20లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పులను విశ్లేషిస్తూ ఎడిఆర్ ఒక నివేదికను రూపొందించింది. ఈ విశ్లేషణ ప్రకారం 7 జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తులు వరుసగా రూ.6,988.57 కోట్లు, రూ.2,129.38 కోట్లుగా వున్నాయి. 44 ప్రాంతీయ పార్టీల్లో మొదటి పది పార్టీల ఆస్తులే 95.27 శాతం ఉన్నాయి. వాటి విలువ రూ.2028.715 కోట్లు. వీటిల్లో సమాజ్‌వాదీ పార్టీ వాటా 26.46 శాతం (రూ.563.47కోట్లు)గా వుంది. తర్వాతి స్థానంలో టిఆర్ఎస్ రూ.301.47కోట్లుతో వుండగా, మూడో స్థానంలో అన్నాడిఎంకె రూ.2677.61 కోట్లుతో వుంది. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల్లో 76.99శాతం వాటాలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనే వున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ కేటగిరీ కింద జాతీయ పార్టీల్లో బిజెపి, బిఎస్పిలు వరుసగా రెండు స్థానాలు ఆక్రమించాయి. రూ.3,253 కోట్లు, రూ.618.86 కోట్లు మేరకు ఎఫ్‌డిలను కలిగివున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో టిఆర్ఎస్ రూ.256.01 కోట్ల ఎఫ్‌డిలతో రెండో స్థానంలో వుంది. జాతీయ పార్టీల అప్పులు రూ.74.27 కోట్లుగా వుండగా, ప్రాంతీయ పార్టీల రుణాలుల రూ.60.66 కోట్లుగా వున్నాయి.
ఎన్నికల బాండ్లపై నిషేధం విధించాలి : ఏచూరి
ఎలక్టోరల్ బాండ్లు, ఆశ్రిత పక్షపాతం ద్వారా రాజకీయ అవినీతికి పాల్పడడం వల్లనే బిజెపి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను సంపాదించగలిగిందని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బిజెపి ఈ ఆర్థిక, అంగ బలంతోనే స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగేందుకు గల అవకాశాలు దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.