Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి, ఉపాధి కూలి కోసం పోరాటం
- అంటరానితనానికి వ్యతిరేకంగా ఆందోళనలు
- సమగ్ర భూ పంపిణీకై సమరశీల ఉద్యమాలు
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపు
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన హిందూత్వ శక్తులు కేంద్ర అధికారంలో తిష్ట వేయడం రాజ్యాంగ మౌలిక అంశాలకు తీవ్ర ప్రమాదంగా మారాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని పెలంబలూరులో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సదస్సులో వెంకట్ మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేసుకొని రాజ్యాంగ పీఠికలో ఉన్న మౌలిక అంశాలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్రంతో అంటరానితనానికి వ్యతిరేకంగా, ఆర్థిక వికేంద్రీకరణ, స్వావలంబన, ప్రజల భాగస్వామ్యం అనే నినాదాలు గతంలో ఉండేవనీ, ప్రస్తుతం ఆర్థిక సుస్థిరతను తుంగలో తొక్కి మతోన్మాద శక్తులు సామాజిక తరగతులు మీద, వ్యవసాయ కార్మికుల మీద దుర్మార్గమైన దాడికి సిద్ధపడుతున్నాయని విమర్శించారు. అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాల భూములను బీజేపీ ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా గుంజుకుంటున్నదని ఆరోపించారు. సమగ్ర భూ పంపిణీ అమలు జరిగితే పేదల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు వ్యవసాయ కార్మికులు, కష్ట జీవుల ఆర్థిక స్వావలంబన, స్వతంత్రత బలపడుతుందని అన్నారు. పేదల నుంచి ప్రభుత్వాలు బలవంతంగా భూములను గుంజు కోవడాన్ని నిరసిస్తూ, సమగ్ర భూ పంపిణీ సాధన కోసం సమరశీల ఉద్యమాలు ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. కూలీలకు సమ్మర్ అలవెన్స్ రద్దు చేయడంతో పాటు చట్టానికి తూట్లు పొడిచే అనేక చర్యలను కేంద్రం చేపట్టిందని దుయ్యబట్టారు. ఈ చర్యలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే కాలంలో కూలీ, భూమి సమస్యలతోపాటు అంటరానితనానికి, లింగ వివక్షకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, శాసన సభ్యులు చెన్ని దురై, మాజీ శాసన సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాజరస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమత లింగం తదితరులు పాల్గొన్నారు.