Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు మేరకు ఈ నెల 31న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త ''విద్రోహ దినం''కు రైతులు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ మేరకు రైతు సంఘాల నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
ఎస్కేఎం భాగస్వామంలోని అన్ని రైతు సంఘాలు ఈ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలోని కనీసం 500 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం కూడా సమర్పించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం లేఖలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయకపోవడం ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకుంటామనీ, అమరవీరుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా గత రెండు వారాలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎంఎస్పీ అంశంపై కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదనీ, కావున దేశవ్యాప్తంగా ఉన్న రైతులు తమ ఆగ్రహాన్ని ''విద్రోహ దినం''తో ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చినట్టు రైతు నేతలు తెలిపారు.'మిషన్ ఉత్తరప్రదేశ్' కొనసాగుతుందని, దీని ద్వారా రైతు వ్యతిరేక పాలనకు గుణపాఠం చెబుతామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్పష్టం చేశారు.
నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ల ఉపసంహరణ, రైతులకు ఎంఎస్పి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు నేతలు పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేదని తెలిపారు. పంజాబ్, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి సంయుక్త కిసాన్ మోర్చా పేరు, బ్యానర్, వేదికను ఏ రాజకీయ పార్టీ, ఏ అభ్యర్థి ఉపయోగించరాదని నేతలు స్పష్టం చేశారు.