Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతల గురించి మాట్లాడేవారికే యూపీ ఓటర్లు అనుకూలం
- రైతు నాయకుడు రాకేశ్ టికాయత్
లక్నో : యూపీ ఎన్నికల్లో హిందూ-ముస్లిం ఓట్ల విభజన వంటి మత రాజకీయాలు పని చేయవని రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడేవారికే యూపీ ఓటర్ల అనుకూలంగా ఉంటారని తెలిపారు. ఒక పార్టీ లేదా నాయకుడి పేరును వెల్లడించకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, దేశంలో అతిపెద్ద కీలక రాష్ట్రమైన యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అధికార బీజేపీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ వాడుతున్న అయోధ్య రామ మందిర నిర్మాణం, కాశీ కారిడార్ అంశాలు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ను టార్గెట్ చేస్తూ యోగి చేసిన '80 శాతం, 20 శాతం' , 'పాకిస్థాన్, జిన్నా మద్ధతుదారులు, భక్తులు' వ్యాఖ్యలను వారు గుర్తు చేశారు. అయితే, ఈ నేపథ్యంలోనే రాకేశ్ టికాయత్.. బీజేపీ, యోగిపై ఇలాంటి పరోక్ష వ్యాఖ్యలు చేశారని వివరించారు. యూపీలో రైతులు కష్టకాలంలో ఉన్నారని టికాయత్ అన్నారు. ఇక్కడ రైతులు తాము పండించిన పంటకు రావాల్సినదానికంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని చెప్పారు. 'అధిక' విద్యుత్ బిల్లులను బలవంతంగా చెల్లించాల్సిన దుస్థితి ఉన్నదని వివరించారు. యూపీ ఎన్నికల్లో రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత, మధ్యతరగతి ద్రవ్యోల్బణం వంటివే అంశాలని టికాయత్ అన్నారు. అయితే, జిన్నా, పాకిస్థాన్‌లపై తరుచూ వినిపించే ప్రకటనలతో హిందూ-ముస్లిం ఓటర్లను విభజించే ప్రయత్నాలు ఇక్కడ కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఇవేవీ పని చేయకపోగా.. ఈ ప్రకటనలు చేసేవారికే నష్టాన్ని తీసుకొస్తుందని టికాయత్ చెప్పారు. యూపీలో రైతులు ప్రస్తుతం సంతోషంగా లేరనీ, ఈ ప్రభావం ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని వివరించారు. యూపీలో షెడ్యూల్ ప్రకారం మొత్తం ఏడు దశల్లో జరగబోయే ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.