Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ కొనుగోలు చేసింది..
- న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
- ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందంలో ముఖ్యభూమిక ఈ స్పైవేర్
- ప్రజల డబ్బుతో ప్రజలపైనే నిఘాకు పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వం
- స్పైవేర్ ఇస్తామనగానే నెతన్యాహూతో మరింత దోస్తీ!
- ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఓటింగ్
'పెగాసస్' కుంభకోణంలో మోడీ సర్కార్ నిజస్వరూపం బయటపడింది. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను మోడీ సర్కార్ కొనుగోలు చేసిందని 'న్యూయార్క్ టైమ్స్' వార్తా కథనం పేర్కొన్నది. పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టును, పార్లమెంట్‌ను కేంద్రం తప్పుదోవ పట్టించిందని తాజా పరిణామం సూచిస్తోంది. పెగాసస్ కోసం ఎన్‌ఎస్‌వోతో ఎలాంటి లావాదేవీలూ జరపలేదని కేంద్రం గతంలో ప్రకటన చేయగా, అది పచ్చి అబద్ధమని తేలింది.
న్యూఢిల్లీ : యావత్ దేశాన్ని కుదిపేసిన 'పెగాసస్' కుంభకోణంలో మోడీ సర్కార్ పాత్ర నిజమేనని రుజువైంది. నిఘా సాఫ్ట్‌వేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయ పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' ('ద బాటిల్ ఫర్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్‌వెపన్' శీర్షికతో) సంచలన కథనం వెలువరించింది. రెండు బిలియన్ డాలర్ల (సుమారుగా రూ.15వేల కోట్లు) రక్షణ ఒప్పందంలో క్షిపణుల కొనుగోలుతో పాటు పెగాసస్ కూడా ఉందని, నిజానికి ఒప్పందంలో 'పెగాసస్ ముఖ్య భూమిక' పోషించిందని వార్తా కథనం పేర్కొన్నది. నిఘా సాఫ్ట్వేర్ ఇస్తామని చెప్పగానే నెతన్యాహూతో ప్రధాని మోడీ దోస్తీ మరింత పెరిగిందని తెలిపింది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ఇదీ..
పెగాసస్ వ్యవహారంపై దాదాపు ఏడాదిపాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించామని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ గత దశాబ్ద కాలంగా నిఘా సాఫ్ట్వేర్లను సబ్స్క్రిప్షన్ విధానంలో వివిధ దేశాల ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ను భారత్, అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొనుగోలు చేశాయి. భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ తొలిసారిగా 2017 జులైలో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం అదే తొలిసారి.
ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాల, సాంకేతిక మార్పిడి కోసం 2 బిలియన్ డాలర్ల (సుమారుగా రూ.15వేల కోట్లు) ఒప్పందం కుదిరింది. 'పెగాసస్' ముఖ్య భూమికగా ఈ డీల్ కుదిరింది. ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనతో ఇరు దేశాల నేతల మధ్య అన్యోన్యత మరింత పెరిగింది. నిఘా సాఫ్ట్వేర్ అందజేసినందుకు బదులుగా..2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్‌లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా భారత్ ఓటేసింది.
కాగా, ఎన్ఎస్వో గ్రూప్ దాదాపు ఓ దశాబ్దం నుంచి నిఘా సాఫ్ట్‌వేర్‌ను సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికపై ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోంది. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వెర్షన్ ఏదైనప్పటికీ దానిలోని సమాచారాన్ని నమ్మకంగా తెలుసు కోగలుగుతుందని హామీ ఇస్తోంది. ఇదిలా ఉండగా, పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనాన్ని కేంద్రం తోసిపుచ్చింది. ఆరోపణలకు సరైన ప్రాతిపదిక లేదని కొట్టి పారేసింది. అయితే గత సంవత్సరం అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్ర నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. భారతదేశంలో నిర్ది ష్టంగా కొందరు వ్యక్తులపై నిఘా పెట్టేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయో గించినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దేశ భద్రత అనే బూచిని చూపిన ప్రతిసారీ ప్రభుత్వానికి మార్గం సుగమం కాబోదని స్పష్టం చేసింది. ఈ బూచిని చూపినంత మాత్రాన న్యాయ వ్యవస్థ మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది.
ఏమిటీ కుంభకోణం?
'పెగాసస్'ను 'మిలటరీ గ్రేడ్' నిఘా సాఫ్ట్‌వేర్‌గా పేర్కొంటారు. స్మార్ట్ఫోన్లు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లలో దీనిని రహస్యంగా ప్రవేశపెడతారు. అక్కడ్నుంచీ వాటిని వాడే వ్యక్తులపై నిఘా కొనసాగుతుంది. సాధారణంగా దీనిని ఉగ్రవాద చర్యలు, దేశ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి వాడాలి. కానీ భారత్‌లో మోడీ సర్కార్ దేశ ప్రజలపైనే ప్రయోగించింది. ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై పెగాసస్‌ను ప్రయోగించిందని 'ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ కన్సార్టియం' ఆధారాలు సేకరించింది.దీనికి సంబంధించిన వివరాల్ని మనదేశంలో న్యూస్ వెబ్ పోర్టల్ 'ద వైర్' విడుదల చేసింది. మోడీ సర్కార్ పెగాసస్‌తో దాదాపు 300మందిపై నిఘా చర్యలకు పాల్పడిందని 'ద వైర్' గత ఏడాది వార్తా కథనం ప్రచురించింది. ఇది దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌ను సైతం కుదిపేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.