Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అవినీతిని తరిమికొట్టేందుకు ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అవినీతి ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని హెచ్చరించారు. ఈ చెదను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. 2022లో తొలి 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కోటి మందికి పైగా బాలలు తమ మనసులో మాటను పోస్టు కార్డుల ద్వారా తనకు తెలియజేశారని చెప్పారు. ఈ పోస్టు కార్డులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చాయనీ, అదేవిధంగా విదేశాల నుంచి కూడా కొన్ని వచ్చాయని తెలిపారు. మన దేశ భవిష్యత్తు పట్ల నూతన తరం దృక్పథం, విస్తృతంగా, సమగ్రంగా ఈ పోస్ట్ కార్డుల ద్వారా తెలిసిందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక రాసిన పోస్ట్ కార్డ్‌లోని విషయాన్ని ప్రస్తావిస్తూ, 2047నాటికి అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలని తాను కలలు కంటున్నానని ఆ బాలిక రాసినట్టు తెలిపారు. ఈ చెద నుంచి బయటపడటానికి 2047 వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు. దేశ ప్రజలు, యువత అందరూ కలిసికట్టుగా చేయవలసిన పని ఇది అని చెప్పారు. కర్తవ్య భావన ఉన్నపుడు, కర్తవ్యమే అత్యున్నతమైనది అయినపుడు అవినీతి ఉండదని చెప్పారు.