Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు ఘన నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న గాంధీ స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం పుష్పాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు హరదీప్ సింగ్ పురి, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కూడా వీరి వెంట ఉన్నారు. గాంధీకి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. 1948 జనవరి 30న గాంధీజిని హిందూత్వ ఉగ్రవాది నాథురాం వినాయక్ గాడ్సే కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి విదితమే. గాంధీ వర్ధంతిని అమరవీరుల దినంగా పాటిస్తూ ఆయనకు దేశం ఘన నివాళులర్పిస్తూవస్తోంది.
మరోవైపు గాంధీజీని హత్య చేసిన గాడ్సేని కీర్తిస్తూ హిందూత్వ అతివాదశక్తులు ఈ ఏడాది కూడా సంబరాలు జరుపుకున్నాయి. హిందూ మహాసభ నేతృత్వంలో ఉగ్రవాది అయిన గాడ్సేకు పలుచోట్ల పూలదండలు వేసి నివాళులర్పించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియార్‌లో గాడ్సేతో పాటు సహ కుట్రదారుడైన నారాయణ్ ఆప్టేని స్మరిస్తూ 'గాడ్సే-ఆప్టే స్మృతి దివస్'ను నిర్వహించారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లోని రారుపుర్లో గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన హిందూత్వ తీవ్రవాదులు కాలిచరణ్ మరో నలుగురుని 'గాడ్సే-ఆప్లే భారతరత్న' పురస్కారంతో సత్కరిస్తున్నట్లు హిందూమహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. ఇది హిందూత్వ శక్తుల బరితెగింపునకు నిదర్శనమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.