Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వ్యవసాయ సమస్యలు పరిష్కరించకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నదాతలకు చేసిన వంచనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం నాడు 'ద్రోహ దినం' పాటించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ ఆదివారం తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు నిర్విరామంగా రైతన్నలు చేపట్టిన ఆందోళనల్లో లేవనెత్తిన వ్యవసాయ సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు 9న లేఖ రూపంలో హామీ ఇవ్వడంతోనే ఆందోళనను విరమించామని ఆయన తెలిపారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చకుండా అన్నదాతలకు ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు. 'రైతన్నలకు ద్రోహం చేసినందునే జనవరి 31న దేశవ్యాప్తంగా 'ద్రోహ దినం' నిర్వహించనున్నాం. లేఖలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం ఈనాటికీ అమల్జేయడం లేదు' అని తికాయత్ తెలిపారు. రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో 2020 నవంబరు నుంచి గతేడాది డిసెంబరు వరకు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌లలో అన్నదాతలు నిర్విరామంగా ఆందోళనలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళనతోనే మూడు చీకటి చట్టాలను మోడీ సర్కార్ వెనక్కి తీసుకోవాల్సివచ్చింది. కానీ అన్ని పంటలకూ మద్దతు ధర కల్పించేలా చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌తో సహా రైతులు లేవనెత్తిన పలు అంశాలను కేంద్రం పరిష్కరించకుండా మోసం చేసిందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.