Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖండించిన జమ్మూకాశ్మీర్ ఎల్జీ, మాజీ ముఖ్యమంత్రులు
- ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
- మృతుల్లో జేషే టాప్ కమాండర్
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక ఘటనలో ఉగ్రవాదులు పోలీసును కాల్చి చంపారు. రెండు వేర్వేరు ఎన్కౌంటర్ ఘటనలలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూకాశ్మీర్ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా బిజ్బెహర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సెలవుల్లో ఉన్న పోలీసు అలీ మహమ్మద్‌పై ఉగ్రవాదులు ఆయన ఇంటి బయట కాల్పులు జరిపారు. అలీ మహ్మద్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మరణించారు. ఒక పోలీసును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి చేయడం ఈ ఏడాదిలో ఇదే తొలి ఘటన కావడం గమనార్హం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ కార్యాలయం ట్వీట్ చేసింది. అలీ మహమ్మద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఆయన హత్యను జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఖండించారు.
రెండు వేర్వేరు ఎన్కౌంటర్ ఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే మహమ్మద్ (జేఈఎం) టాప్ కమాండర్ జహీద్ వానీ కూడా ఉన్నారు. శనివారం సాయంత్రం బుద్గాం, పుల్వామా జిల్లాల్లో ఈ ఎన్కౌంటర్ ఘటనలు జరిగాయని పోలీసు అధికారులు చెప్పారు. శనివారం సాయంత్రం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు దారి తీశాయని వివరించారు.