Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక మావోయిస్టు మృతి
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని చింతల్నార్ దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. సుక్మా ఎస్పీ సునీల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం, పెద్దబొడ్కెల్ గ్రామాల మధ్య అడవిలో ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో రూ. లక్షల రివార్డు గల తిమ్మాపురం గ్రామానికి చెందిన మడ్కం జోగా అనే మావోయిస్టు హతమయ్యాడని అన్నారు. సంఘటన స్థలం నుంచి ఒక 12 బోర్ రైఫిల్, ఒక పిట్టు, కంట్రిమ్డ్ లైట్ హ్యాండ్ గ్రానైట్, కోడెక్స్ వైర్ ఐదు మీటర్లు, 3 డిటోనేటర్లు, సుమారు 15 మీటర్ల రెండు పవర్ వైర్లు, 2 జెలటిన్ రాడ్స్, ఒక ఇనుప రాడ్, రెండు ఛార్జ్ చేయగల టార్చ్, ఐదు బ్యాటరీలు, మందులు ఇతర రోజువారీ ఉపయోగకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ ధృవీకరించారు. ఘటనా స్థలంలో ఉన్న రక్తం మరకలు ఆధారంగా మరికొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని తెలిపారు. రక్షణ బలాలు అడవిని జల్లెడ పడుతున్నట్టు ఎస్పీ తెలిపారు. సంఘటనా స్థలానికి సమీపంలో నలుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారని వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని తీసుకొని వస్తుండగా మావోయిస్టులు మళ్లీ కాల్పులు జరపడంతో మళ్లీ ఎదురు కాల్పులు జరిపినట్టు చెప్పారు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలనూ బీడీఎస్ బృందం నిర్వీర్యం చేసిందన్నారు. మృతుడు పెదబొడ్కెల్ ఆర్పీసీ మావోయిస్టు ఆర్గనైజేషన్‌లో మిలీషియా కమాండర్‌గా పనిచేస్తున్నాడని ఎస్పీ వివరించారు. కోబ్రా, డీఆర్జీ జిల్లా పోలీసు బలగాలు కాల్పుల్లో పాల్గొన్నారని వెల్లడించారు.