Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంబంధిత అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి
- సుప్రీంకోర్టును కోరిన పిటిషనరు
న్యూఢిల్లీ : పెగాసస్ కుంభకోణంపై 'న్యూయార్క్ టైమ్స్' వార్తా కథనం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజా వార్తా కథనాన్ని పరిగణలోకి తీసుకొని ఇజ్రాయెల్‌తో 2017నాటి రక్షణ ఒప్పందంపై విచారణకు ఆదేశించాలని, ఒప్పందంలో లావాదేవీలు జరిపిన ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని న్యాయవాది ఎంఎల్.శర్మ తాజాగా సుప్రీంకోర్టును కోరారు. పెగాసస్ కుంభకోణంపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లు వేసినవారిలో ఎంఎల్.శర్మ ఒకరు. న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనంతో తమ అనుమానాలు మరింత బలపడ్డాయని, మోడీ సర్కార్ 2017లో పెగాసస్‌ను కొనుగోలు చేసిందనేందుకు కచ్చితమైన ఆధారాలున్నాయని ఎంఎల్.శర్మ తాజాగా సమర్పించిన దరఖాస్తులో సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
'ద బాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్ వెపన్' అనే పేరుతో న్యూయార్క్ టైమ్స్ రెండు రోజుల క్రితం వార్తా కథనాన్ని వెలువరించింది. ఈ కథనం ప్రకారం, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ ఒక దశాబ్దకాలంగా నిఘా సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతోంది. దీనిని సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రమే కొనుగోలు చేయగలవు. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కచ్చితంగా హ్యాకింగ్ చేస్తామని ఎన్ఎస్వో హామీ ఇచ్చింది. భారత్-ఇజ్రయెల్ మధ్య 2017నాటి రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్‌ను మోడీ సర్కార్ కొనుగోలు చేసిందని వార్తా కథనం స్పష్టం చేసింది.
గత ఏడాది ఈ అంశం దేశ రాజకీయాల్ని కుదిపేసింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలుకాగా, ముగ్గురు స్వతంత్ర సభ్యులతో విచారణ జరుపుతోంది. జాతీయ భద్రతను బూచిగా చూపి ప్రభుత్వాలు తప్పించుకోలేవని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. గోప్యతా హక్కు, వాక్ స్వాతంత్య్రం ఉల్లంఘనపై విచారణ కమిటీ దృష్టిసారించాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. పెగాసస్ వాడారా? లేదా? అని సుప్రీం ప్రశ్నించగా, దీనికి కేంద్రం సూటిగా సమాధానం ఇవ్వటం లేదు.
2024 ఎన్నికలకు ముందు మరిన్ని పెగాసస్‌లు : చిదంబరం
పెగాసస్ స్పైవేర్ కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఆదివారం తీవ్రంగా స్పందించారు. మోడీ సర్కార్ తీరుచూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందే పెగాసస్లాంటివి ఇంకా అనేకమైన స్పైవేర్లను కొనుగోలు చేసే ప్రమాదం కనిపిస్తోందని తెలిపారు. పెగాసస్ ఖర్చు కన్నా రెట్టింపు ధరతో తాజా స్పైవేర్‌ను కొనుగోలు చేయవచ్చునని విమర్శించారు. న్యూయార్క్ టైమ్స్ ఒక 'సుపారీ మీడియా' అని వ్యాఖ్యానించిన.. కేంద్ర మంత్రి వికె సింగ్ వ్యాఖ్యలకు కూడా చిదంబరం కౌంటరిచ్చారు. 'ఆయన ఎప్పుడైనా 'న్యూయార్క్ టైమ్స్', 'వాషింగ్టన్ పోస్ట్' పత్రికల్ని చదివారా? వాటర్‌గేట్ కుంభకోణం, పెంటగాన్ పేపర్స్‌ను బహిర్గతం చేయడంలో అవి ఎంతటి కీలక పాత్ర పోషించాయో ఆయనకు తెలిసుండాలి. కానీ చరిత్ర తెలుసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం సినిమాలు చూసైనా తెలుసుకోవచ్చు' అని చిదంబరం ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ' చివరగా 2 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందట. ఈసారి భారత్ మరింత చెల్లించవచ్చు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే... అధునాతన స్పైవేర్ కొనుగోలు చేయడానికి కేంద్రం 4 బిలియన్ డాలర్లయినా చెల్లించొచ్చు. అంతేకాదు, భారత్-ఇజ్రాయెల్ బంధాల్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇదే సరైన సమయమని ప్రధాని చెప్పారు. నిజమే.. పెగాసస్ స్పైవేర్‌లో అడ్వాన్స్డ్ వెర్షన్లు ఉన్నాయేమో ఇజ్రాయెల్‌ను అడగటానికి ఇదే అత్యుత్తమ సమయం'అని చిదంబరం కేంద్రంపై ఎద్దేవా చేశారు.