Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్‌ను 2017 ఇజ్రాయిల్‌లో ప్రధాని మోడీ పర్యటించిన సమయంలోనే కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందే అనేక స్పైవేర్లను మోడీ సర్కార్ తీసుకువస్తుందనీ, ఆరోపించిన ఖర్చు కన్నా రెట్టింపు ధరతో తాజా స్పైవేర్‌ను కొనుగోలు చేయవచ్చునని విమర్శించారు. న్యూయార్క్ టైమ్స్ ఒక 'సుపారీ మీడియా' అని వ్యాఖ్యానించిన.. కేంద్ర మంత్రి వికె సింగ్ వ్యాఖ్యలపై తనదైన కౌంటరిచ్చారు. 'ఆయన ఎప్పుడైనా 'న్యూయార్క్ టైమ్స్', 'వాషింగ్టన్ పోస్ట్' పత్రికల్ని చదివారా? వాటర్‌గేట్ కుంభకోణం, పెంటగాన్ పేపర్స్‌ను బట్టబయలు చేయడంలో వార్తపత్రికలు ఎంతటి కీలక పాత్ర పోషించాయో ఆయనకు తెలిసుండాలి. చరిత్ర తెలుసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం సినిమాలు చూసి అయినా తెలుసుకోవచ్చు' అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో 'చివరగా 2 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందట. ఈసారి భారత్ మరింత చెల్లించవచ్చు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే... అధునాతన స్పైవేర్ కొనుగోలు చేయడానికి కేంద్రం 4 బిలియన్ డాలర్లయినా చెల్లించొచ్చు. అంతేకాదు,భారత్-ఇజ్రాయెల్ బంధాల్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇదే సరైన సమయమని ప్రధాని చెప్పారు. నిజమే.. పెగాసస్ స్పైవేర్‌లో అడ్వాన్స్డ్ వెర్షన్లు ఉన్నాయేమో ఇజ్రాయెల్‌ను అడగటానికి ఇదే అత్యుత్తమ సమయం'అని చిదంబరం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.