Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపూర్‌లో అభ్యర్థుల జాబితా వెల్లడితో..
గువహతి : ఫిబ్రవరిలో జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా పట్ల పార్టీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్బీరేన్ సింగ్ దిష్టిబొమ్మలను బీజేపీ మద్దతుదారులు ఆదివారం దహనం చేశారు. ఫ్లకార్డులను చేతబూని ఆందోళనలు చేపట్టారు. అధిష్టానం, రాష్ట్ర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాల ధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇంఫాల్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. ఈ అభ్యర్థుల జాబితా పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు పార్టీని వీడినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారికి టికెట్లు ఇస్తూ.. తమకు ప్రాధాన్యత ఇవ్వని వారు ఆందోళనలకు దిగినట్టు తెలుస్తున్నది. మణిపూర్‌లోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నది. దీనికి సంబంధించిన జాబితాను తాజాగా విడుదల చేసింది. కాగా, కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలోకి చేరిన 10 మంది నేతలకు ఆ పార్టీ టికెట్టు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ .. సాంప్రదాయంగా వస్తున్న హీన్‌గాంగ్ నుండే పోటీకి దిగుతున్నారు. మరో కీలక మంత్రి బిశ్వజిత్ సింగ్ తోంజు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. సోమాతై సైజా.. ఉఖ్రుల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి నమ్మకస్తులుగా భావించే వారికి టిక్కెట్లు దక్కినట్టు తెలుస్తున్నది. 2017 ఎన్నికల్లో 21 సీట్లను గెలుపొందిన బీజేపీ.. చిన్న పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.