Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుగా రెండు లేబర్ కోడ్స్ అమల్లోకి!
- వచ్చే ఏడాదిలో మరో రెండు..
- ఒక్కసారిగా అమల్లోకి తెస్తే దెబ్బతింటామని భావిస్తున్న మోడీ సర్కార్
- రైతు ఉద్యమం స్ఫూర్తితో కార్మికలోకం ఒక్కటవుతుందని భయం!
- ఐదు రాష్ట్రాల న్నికలయ్యాక..ముందుకు : రాజకీయ విశ్లేషకులు
యాజమాన్యాలకు, బడా కంపెనీలకు అనుకూలంగా చట్టాలను మార్చేసి..వాటికి మోడీ సర్కార్ కార్మిక సంస్కరణలు అనే ముద్దుపేరు పెట్టింది. ఎంపీల బలంతో ఏకపక్షంగా నాలుగు లేబర్కోడ్లను తీసుకొచ్చింది. వీటికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడి రెండేండ్లు దాటుతోంది. అయితే అన్నింటినీ ఒక్కసారిగా కాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికసంఘాలన్నీ దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందేమో! రైతులు ఉద్యమించినట్టు..కార్మికలోకం ఒక్కటైతే ఎలా? అనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.
న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెండు లేబర్ కోడ్స్..అటుపై సంవత్సరంలో మిగతా రెండు కోడ్స్ అమల్లోకి తేవాలన్న వ్యూహంతో కేంద్రం ఉన్నట్టు జాతీయ మీడియాలోనూ వార్తా కథనాలు వెలువడ్డాయి. నూతన సాగు చట్టాల రద్దు తర్వాత..లేబర్ కోడ్స్ అమలుపై కేంద్రం వెనుకాడుతోందని సమాచారం. వీటిని అమలుజేయాల్సిన రాష్ట్రాలు సైతం సుముఖంగా లేకపోవటమూ ఒక కారణంగా కనపడుతోంది. మరోవైపు లేబర్ కోడ్స్‌ను కార్మికసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాగు చట్టాల్ని రద్దు చేసినట్టుగానే, వీటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
అంతా సిద్ధం !
కార్మిక చట్టాల అమలు అన్నది రాజ్యాంగంలో 'ఉమ్మడి జాబితా'లో ఉన్న అంశం. చట్టాల్ని నోటిఫై చేస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ తమ రాష్ట్రాల్లో ముసాయిదా నిబంధనావళి రూపొందించాలి. గత ఏడాది డిసెంబర్ 15నాటికి వేజ్ కోడ్ (వేతనాల కోడ్)పై 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్‌పై 13 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనావళిని రూపొందించాయి. అలాగే ఇండిస్టియల్ రిలేషన్స్ కోడ్‌పై 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సోషల్ సెక్యూరటీ కోడ్‌పై 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిబంధనావళిని సిద్ధం చేశాయి.
రెండేండ్లు దాటింది
లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి చర్చకు తావివ్వకుండా ఎంపీల బలంతో మోడీ సర్కార్ 29 కార్మిక చట్టాలకు సవరణలు చేసింది. ఇండిస్టియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండీషన్..అనే మూడు లేబర్ కోడ్స్‌ను సెప్టెంబర్, 2020లో పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ముసాయిదా బిల్లులను చట్టాలుగా మార్చింది. కోడ్ ఆన్ వేజెస్ 2019లోనే ఆమోదం పొందింది. కార్మిక హక్కులపై రాజీపడుతూ, పూర్తిగా యాజమాన్యాలకు, బడా కంపెనీలకు అనుకూలంగా లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చింది. ఈ చట్టాల అమలపై ఆయా రాష్ట్రాలు మళ్లీ వేరు వేరుగా ముసాయిదా నిబంధనావళి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కిరాలేదు.
అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే!
నాలుగు లేబర్ కోడ్స్‌ను అమల్లోకి తీసుకురావాలనే మోడీ సర్కార్ బలంగా భావిస్తోంది. రాష్ట్రాలు ఆమోదం తెలపటం, కోడ్స్‌పై నిబంధనావళిని రూపొందించటం..అన్నది అంతా కేంద్రం చేతిలో ఉందని, ఉద్దేశపూర్వకంగానే మెల్లమెల్లగా కేంద్రం అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది చర్చనీయాంశం కాకూడదని, రాజకీయంగా దెబ్బతినకూడదనే వ్యూహంతో కేంద్రం వెళ్తోందని విశ్లేషకులు అంటున్నారు. వివాదాస్పద సాగు చట్టాలపై రైతు ఉద్యమం ఎంత ఉధృతంగా సాగిందో అందరికీ తెలిసిందే. లేబర్ కోడ్స్‌పై కార్మికలోకం ఒక్కటైతే, ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు మద్దతు పలికితే ఇబ్బంది అవుతుందని కేంద్రం భావిస్తోందట! అలాగే కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో? అనే అనుమానాలు పాలకుల్లో ఉందట.
వ్యతిరేకత ఎందుకు?
ఉదాహరణకు 'కోడ్ ఆన్ ఇండిస్టియల్ రిలేషన్స్' (పారిశ్రామిక సంబంధాల కోడ్)ను తీసుకుంటే, పారిశ్రామిక వివాదాలు, కార్మికసంఘాల గుర్తింపుపై వివాదాస్పద అంశాలున్నాయి. కార్మికులను తొలగిస్తే, కంపెనీ ఒకవేళ లే-ఆఫ్ ప్రకటిస్తే..ఇదేమని అడిగే హక్కు కార్మిక సంఘాలకు ఉండదు. పాత చట్టాల్లో పేర్కొన్న ప్రయోజనాలు, హక్కులు అన్నీ లేబర్ కోడ్స్‌లో యాజమాన్యాలకు అనుకూలంగా మార్చేశారు. 100మంది లేదా ఆపైన కార్మికులు ఉంటేనే..ఆ కంపెనీలో ఉద్యోగుల సర్వీస్, ఇతర ప్రయోజనాల అమలు ఉంటుందని లేబర్ కోడ్ చెబుతోంది. కార్మికుల సంఖ్య 100లోపు ఉంటే..సర్వీస్ నిబంధనలు, ప్రయోజనాలు ఏవీ నెరవేర్చాల్సిన బాధ్యత ఆ కంపెనీపై ఉండదు.
కంపెనీ చెప్పేదే ఫైనల్
కార్మికుల సంక్షేమం, పని ప్రదేశాల్లో భద్రత అంశాలకు సంబంధించి యాజమాన్యాలకు అనేక మినహాయింపులు ఇస్తూ 'ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ , వర్కింగ్ కండీషన్ కోడ్'ను కేంద్రం తీసుకొచ్చింది. కొత్తగా ఫ్యాక్టరీలు, కంపెనీలు ఏర్పాటుచేసే వారికి అనేక ప్రయోజనాలు ప్రకటించారు. ఉదాహరణకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు యాజమాన్యం కల్పించిందా? లేదా? అన్నది కంపెనీ చెప్పే లెక్కే ఫైనల్. మిగతా లేబర్ కోడ్స్లోనూ ఇలాంటివే కొన్ని వందల అంశాలున్నాయి. స్వాతంత్రం పూర్వం నుంచి దేశంలో అమలవుతున్న కార్మిక చట్టాలకు సవరణలు చేసి లేబర్ కోడ్స్‌ను కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది.