Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీలున్నా.. నిరుద్యోగులతో కేంద్రం ఆటలు
- ప్రభుత్వ విభాగాల్లో లక్షల సంఖ్యలో పోస్టులు
- భర్తీ చేయకుండా చోద్యం చూస్తున్న మోడీ సర్కారు
- ఆవేదన వ్యక్తం చేస్తున్న దేశ యువత.. పట్టించుకోని ప్రభుత్వం
- కేంద్రం పరిధిలోని విభాగాల్లో 12 లక్షలకు పైగా ఖాళీలు : కేంద్ర ప్రభుత్వ సమాచారం
దేశంలో వాజ్పేయి పాలన తర్వాత 2014లో తొలిసారిగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇందుకు 2014 ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీ దేశ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. దేశంలోని యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న వాగ్దానం ఇందులో ఒకటి. ఈ హామీ దేశ నిరుద్యోగ యువతలో ఆశలు చిగురింపజేసింది. కానీ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తూ వారి ఆశలపై మోడీ సర్కారు నీళ్లు చల్లింది.
న్యూఢిల్లీ: అధికారంలోకి రావటం కోసం మోడీకి హామీలు ఇవ్వడంలో ఉన్నంత వేగం.. ఉద్యోగ నియామకాల్లో మాత్రం లోపించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సర్వీసులలో దాదాపు 12లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తూ ప్రభుత్వ సమాచా రమే వెల్లడిస్తున్నది. అయినప్పటికీ కేంద్రం ఈఖాళీల భర్తీకి చర్యలు చేపట్టడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ నుంచే వచ్చే నోటిఫికేషన్లపై ఎన్నో ఆశలు పెట్టుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దేశంలోని యువతకు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శాపంగా మారుతున్నది. గతేడాది జులైలో పార్లమెంటులో కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం.. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ వంటి మూడు నియామక సంస్థల ద్వారా 2016-17 నుంచి 2020-21 మధ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4.45 లక్షల మంది రిక్రూట్ అయ్యారు. పై ప్రకటన తర్వాత పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్రం నియంత్రణ ఉండే ఇతర సర్వీసుల్లో 3.64 లక్షలకు పైగా ఖాళీలు భర్తీకి నోచుకోవాల్సి ఉన్నది. ప్రభుత్వ విభాగాల్లో లక్షల సంఖ్యలో ఉన్న ఖాళీలు, వాటిని భర్తీ విషయంలో కేంద్రం చేష్టలకు ఏమాత్రమూ పొంత కనబడటం లేదు.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలలో 8.72 లక్షలకు పైగా..!
కేంద్ర ప్రభుత్వ విభాగాలలోని 8.72 లక్షలకు పైగా ఖాళీలలో రైల్వేలలో అత్యధికంగా 2.37 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత రక్షణ రంగంలో 2.27 లక్షలకు పైగా ఉండగా.. హౌం శాఖలో 1.28 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.
ఇతర సర్వీసుల్లో 3.64 లక్షలకు పైగా..!
కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు, జ్యుడీషియరీ, సాయుధ బలగాలు వంటి విభాగాల్లో 3.64 లక్షలకు పైగా ఖాళీలు భర్తీ కోసం వేచి చూస్తున్నాయి. వీటిలో సాయుధ బలగాల్లో అత్యధికంగా 1,22,555 ల పోస్టులున్నాయి. కేంద్ర సాయుధ పోలీసుల బలగాలలో 93,432, గ్రామీణ డాక్సేవక్లో 73,452, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177, కేంద్రీయ విద్యాలయాల్లో 10,368 ఖాళీలు ఉన్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 6,535 పోస్టులున్నాయి. ఇక న్యాయవ్యవస్థలోని జిల్లా, దిగువ కోర్టులలో 5,133 జడ్జిల పోస్టులు, హైకోర్టులలో 404, సుప్రీంకోర్టుల 1 పోస్టులు భర్తీకి నోచుకోవాలి.
ఐఐఎంలు (403 ఖాళీలు), ఐఐటీలు (3,876), జెన్వీలు (3,978)లలోనూ పోస్టులు ఉన్నాయి. ఇక కేంద్రం పరోక్ష నియంత్రణ ఉండే ఆరోగ్య వ్యవస్థలోనూ దాదాపు 60వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వైద్యులు,ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ స్టాఫ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆయుష్ వైద్యులు, ఆయుష్ స్పెషలిస్టులు వంటివి ఈ ఖాళీలలో ఉన్నాయి.
రైల్వే నియామకాలపై ఆందోళనలు
భారత రైల్వే చేపట్టిన నియామక ప్రక్రియ తప్పుగా ఉన్నదని ఆరోపిస్తూ ఇటీవల బీహార్, యూపీలలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 35వేల ఉద్యోగాల భర్తీ కోసం 2019లో భారత రైల్వే నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం దాదాపు 1.25 కోట్ల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2020 డిసెంబర్ నుంచి 2021 జులై మధ్య వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించగా దాదాపు 60 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్టు సమాచారం. అయితే, వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి లక్షల సంఖ్యలో అభ్యర్థుల దరఖాస్తులు రావటమనేది దేశంలో ఉన్న తీవ్ర నిరుద్యోగ పరిస్థితి అద్ధం పడుతున్నదని విశ్లేషకులు తెలిపారు. అయితే, ఈ ఉద్యోగాల ఖాళీల భర్తీని రాబోయే ఎన్నికలకు ముందు ఒక ఆయుధంగా వాడుకునేందుకే ఉద్దేశపూర్వకంగా యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నదని దేశంలోని నిరుద్యోగ యువత ఆరోపిస్తున్నది. మోడీ ప్రభుత్వ పని తీరుతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని అన్నారు. ఈ విషయాన్ని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఇలా..
మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఖాళీలు
1. రక్షణ (సివిల్) 2,27,502
2. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం 2,103
3. హౌం వ్యవహారాలు 1,28,842
4. గనులు 6,925
5. పోస్ట్స్ 90,050
మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఖాళీలు
6. రైల్వేలు 2,37,295
7. రెవెన్యూ 76,327
8. సైన్స్ అండ్ టెక్నాలజీ 8,227
9. జలవనరులు, నది అభివృద్ధి,
గంగా ప్రక్షాళన. 4,557
మెత్తం 8,72,243