Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- రేపు కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కోవిడ్ నిబంధనల మధ్య కీలకమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అంశం, పెగాసెస్ స్పైవేర్ వ్యవహారం వంటివి ఈసారి పార్లమెంటులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండు అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశాలు మెండుగా ఉండగా, అధికార పక్షం సైతం సరైన వ్యూహరచనతో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రతిపక్షాలు.. ఉభయ సభల్లోనూ తమ వాణి బలంగా వినిపించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉభయ పక్షాలకూ కీలకం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించి ప్రారంభిస్తారు. 30 నిమిషాల ప్రసంగం అనంతరం లోక్‌సభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాజ్యసభ కార్యక్రమాలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మొదలవుతాయి. మొదటి రోజే ఉభయసభల్లోనూ 'ఎకనామిక్ సర్వే (ఆర్థిక సర్వే)'ను (2021-2022) సమర్పిస్తారు. ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడతారు. మంత్రి బడ్జెట్ ప్రసంగానంతరం రాజ్యసభ కార్యక్రమాలు మొదలవుతాయి. రాజ్యసభకు సైతం మంత్రి బడ్జెట్ సమర్పిస్తారు. ఫిబ్రవరి 2 నుంచి కోవిడ్ ప్రోటోకాల్స్‌కు లోబడి లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలు రెండు షిఫ్టులుగా నడుస్తాయి. రాజ్యసభ కార్యక్రమాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ, అనంతరం మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ లోక్‌సభ కార్యక్రమాలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో బుధవారం నుంచి చర్చ జరగనుంది. ఫిబ్రవరి 7న చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఫిబ్రవరి 2 నుంచి నాలుగు రోజులు తాత్కాలికంగా కేటాయించినట్టు లోక్‌సభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు.