Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హామీ
న్యూఢిల్లీ : గుర్గావ్లో హిందూత్వ గ్రూపులు, ముస్లింలు చేసుకునే శుక్రవారం నాటి నమాజ్ ప్రార్ధనలకు అంతరాయం కలిగించిన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారులపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతున్న పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. రాజ్యసభ మాజీ ఎంపి మహ్మద్ అదీబ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్వేష నేరాలను నిలుపుచేయాలంటూ 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాటించడం లేదంటూ అదీబ్ తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న బెంచ్ ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించే పిటిషన్ల జాబితాలోచేర్చింది. '' కేవలం వార్తా పత్రికల కథనాల ఆధారంగా చెప్పడం లేదు. మేం కూడా ఫిర్యాదులు చేశాం, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా మేం కోరడం లేదు. ఈ కోర్టు ముందస్తు చర్యలను రూపొందించింది.'' అని న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. దానిపై జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ దీనిపై వెంటనే పరిశీలన చేస్తామని, సంబంధిత బెంచ్ ముందు పెడతామని చెప్పారు. హర్యానా చీఫ్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారి సంజీవ్ కౌశల్, డిజిపి, ఐపిఎస్ అధికారి పి.కె.అగర్వాల్‌లపై చర్యలు తీసుకోవాలని అదీబ్ పిటిషన్ వేశారు.