Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది 162 మంది కార్మికులు మృతి
- నెలకు సగటున ఏడు ప్రమాదాలు : ఇండిస్టిఆల్ గ్లోబల్ యూనియన్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో కార్మికులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. గతేడాది భారత్‌లో ఈ ప్రమాదాల కారణంగా 162 మందికి పైగా కార్మికులు చనిపోయారు. దేశంలోని పారిశ్రామిక, వాణిజ్య సముదాయాల్లో రోజురోజుకూ పెరుగుతున్న మరణాల సంఖ్యను ఇది ప్రతిబింబిస్తున్నది.
జెనీవా కేంద్రంగా పని చేసే ఇండిస్ట్రిఆల్ గ్లోబల్ యూనియన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో ఐదు కోట్ల మందికి పైగా కార్మికులకు ఈ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇండిస్టియల్ గ్లోబల్ యూనియన్ సమాచారం ప్రకారం..గతేడాది భారత్ లో నెలకు సగటున ఏడు ప్రమాదాలు జరిగా యి.ఫలితంగా కార్మికులు శాశ్వత వైకల్యానికి గుర య్యారు. తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ఏడాది తొలి వారాల్లో నమోదైన ప్రమాదాలను చూస్తే గతేడాది ప్రమాద ట్రెండ్‌ను కొనసాగేలా కనిపిస్తున్నది.
'ప్రభుత్వ అలసత్వం'
దేశంలో ఇన్ని ప్రమాదాలు జరిగి కార్మికులు మృతి చెందుతున్నప్పటికీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని యూనియన్ తెలిపింది. గత ఐదేండ్లలో, స్వీయ-ధృవీకరణను అనుమతించడానికి ప్రభుత్వం తనిఖీలు, లైసెన్సింగ్‌లను సడలించిందని పేర్కొన్నది. వ్యాపారాన్ని సులభతరం చేయటం కోసం ఆరోగ్యం, భద్రతపై నివేదించటం నుంచి కొన్ని కంపెనీలను కేంద్రం మినహాయించిందని తెలిపింది. భారత్‌లోని ఫ్యాక్టరీల సంఖ్యతో పోలిస్తే ఆరోగ్య, భద్రత ఇన్స్పెక్టర్ల సంఖ్య తక్కువగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా ప్రమాణాల అమలు యూనియన్లు, కార్మికుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నదని వివరించింది. ఇలాంటి ప్రమాదాల్లో భద్రతా చర్యల్లో తీవ్రమైన లోపాలున్నట్టు ఇండిస్ట్రిఆల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజీవ రెడ్డి అన్నారు. తరుచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఉన్నత స్థాయి న్యాయ విచారణకు ఆయన డిమాండ్ చేశారు.
'ఐదేండ్లలో 6500 మంది మృతి'
గతేడాది పార్లమెంటులో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత ఐదేండ్లలో ఫ్యాక్టరీలు, పోర్టులు, గనులు, నిర్మాణ ప్రదేశాలలో కనీసం 6,500 మంది ఉద్యోగులు చనిపోయారు. ఇందులో 2014 నుంచి 2018 మధ్య అత్యధికంగా 80 శాతానికి పైగా మరణాలు నివేదించబడ్డాయి. ఫ్యాక్టరీ మరణాలు 2017-18 మధ్య 20 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ప్రమాదాలు తగ్గుముఖం పట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.