Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షలాది స్కూల్క్, కాలేజీలపై కోవిడ్ ప్రభావం : ఆర్థిక సర్వే వెల్లడి
- విద్యకు దూరమవుతున్న అణగారిన వర్గాల పిల్లలు
- డిజిటల్ అసమానతలతో పెరిగిన డ్రాపవుట్స్
- పడిపోయిన విద్యార్థుల ఎన్రోల్మేంట్
న్యూఢిల్లీ : కోవిడ్ సంక్షోభం మొదలయ్యాక దేశంలో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2022-23 పేర్కొన్నది. దేశంలో గత కొన్నేండ్లుగా పాఠశాలల్లో 6-14 ఏండ్ల బాలల ఎన్రోల్మేంట్ పడిపోయిందని సర్వే తెలిపింది. కోవిడ్ సంక్షోభం మొదలయ్యాక విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు మరింత సంక్లిష్టంగా మారాయని, ఆన్లైన్ లేదా డిజిటల్ బోధనా పద్ధతులు విద్యా రంగంలో అసమానతల్ని మరింత పెంచిందని సర్వేలో వివరించారు. సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2022-23ను విడుదల చేశారు. ఈసందర్భంగా గ్రామాల్లో పాఠశాల విద్య గురించి కేంద్రం విడుదల చేసిన సమాచారం ఈ విధంగా ఉంది.
ప్రయివేటు ఏజెన్సీలతో అధ్యయనం
విద్యారంగంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేసే తాజా గణాంకాలు కేంద్ర విద్యాశాఖ వద్ద లేవని, 2019-20 ఏడాది డాటా మాత్రమే అందుబాటులో ఉందని సర్వే పేర్కొన్నది. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం మొదలైన 2020, ఆ తర్వాత ఏడాది 2021లో విద్యార్థుల డ్రాపవుట్స్, ఎన్రోల్మేంట్ డాటా సేకరించలేదని సర్వే తెలిపింది. విద్యాశాఖకు ఉన్న పరిమితులు, కోవిడ్ నేపథ్యంలో ఎదురైన సవాళ్లు కారణమని తెలిపింది. దాంతో కోవిడ్ ప్రభావాన్ని అంచనా వేయడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయివేట్ ఏజెన్సీల అధ్యయనంపై ఆధారపడాల్సి వచ్చిందని తెలిపారు.
ఏఎస్ఈఆర్ నివేదిక
కోవిడ్ సంక్షోభ సమయంలో 6-14 ఏండ్ల బాలల ప్రవేశాలు పడిపోయాయి. పరిమిత స్థాయిలో ప్రభుత్వ అధ్యయనాలు, ప్రయివేటు ఏజెన్సీ ఇచ్చిన 'యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్' (ఏఎస్ఈఆర్) గణాంకాల్ని ఆధారంగా సర్వే ఈ విషయాల్ని వెల్లడించింది. ఏఎస్ఈఆర్ (గ్రామీణ) నివేదిక ప్రకారం, స్కూల్ డ్రాపవుట్స్ 2018లో 2.5శాతం ఉండగా, 2021నాటికి 4.6శాతానికి పెరిగింది. అలాగే పాఠశాలల్లో విద్యార్థుల చేరికలూ క్రమంగా తగ్గిపోతున్నాయి. 7-10ఏండ్ల బాలల ఎన్రోల్మేంట్ పెద్ద ఎత్తున తగ్గిందని ఆర్థిక సర్వే ప్రస్తావించింది.
కోవిడ్ సమయంలో గ్రామాల్లో ప్రయివేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు మారిన విద్యార్థుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదైంది. ప్రభుత్వ పాఠశాలకు మారిన వారిలో అన్ని వయస్సుల విద్యార్థులున్నారు. లాక్డౌన్, కోవిడ్ సంక్షోభంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నటం, చిన్న చిన్న ప్రయివేట్ స్కూల్స్ మూతపడటం, వలస కార్మికులు గ్రామాలకు తరలివెళ్లటం..మొదలైన కారణాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచింది. ఈ కొత్త పరిణామాన్ని ఎదుర్కోవటం కోసం పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని నివేదిక తెలిపింది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్యను పెంచాలని, తరగతి గదుల సంఖ్యను, బోధనా వసతులను పెంచాలని సూచించింది.
డిజిటల్ అసమానతలు
కోవిడ్ సమయంలో పాఠశాలలు, కాలేజీలు ఆన్లైన్ విద్యను ఎంచుకున్నాయి. ఇది దేశంలో డిజిటల్ అసమానతల్ని మరింత పెంచింది. పాఠశాల, కాలేజీ విద్యను అందరూ సమానంగా పొందలేకపోయారు. స్మార్ట్ఫోన్లు లేక పేద కుటుంబాల పిల్లలు, అవి ఉన్నా నెట్వర్క్ సేవలు లభించక మరికొంత మంది విద్యకు దూరమయ్యారు. ముఖ్యంగా అణగారిన వర్గాల పిల్లలు, యువత విద్యను పొందటంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ వర్గాల్లో విద్యా అసమానతలు మరింతగా పెరిగాయి. మొత్తంగా దేశంలో పాఠశాలలు, కాలేజీలపై కోవిడ్ ప్రభావం పెద్ద ఎత్తున ఉందని సర్వే అభిప్రాయపడింది.