Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరాఖండ్ గ్రామవాసుల మూకుమ్మడి నిర్ణయం
- ప్రభుత్వాల వైఖరికి నిరసన
పితోర్‌గఢ్ : ఫిబ్రవరి 14న జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూకుమ్మడిగా అందరూ నోటాకే ఓటు వేయాలని చంపావత్ ఆమ్ ఖార్క్ గ్రామ ప్రజలు నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌లోని మారుమూల గ్రామమైన చంపావత్కు లింక్ రోడ్డును వేయాలని ఆ గ్రామ ప్రజలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన గ్రామ ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయరాదని తీర్మానించారు. ఇతర ప్రాంతాలతో అనుసంధానమై లేకపోవడంతో ఇప్పటికే 65శాతం మంది గ్రామస్తులు ఊరు విడిచి వెళ్ళిపోయారని వారు ఫిర్యాదు చేస్తున్నారు. 1500మీటర్ల మేర లింక్ రోడ్డు వేయాలని 2007 నుండి కోరుతున్నాం. జిల్ల్లా ప్రణాళికలో ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును చేర్చారు. కానీ ఈ రోజువరకు అమలు జరగలేదని గ్రామస్తులు తెలిపారు. లింక్ రోడ్డు నిర్మిస్తే తనక్‌పూర్-చంపావత్ హైవేకి గ్రామం అనుసంథానమవుతుందని అప్పుడు రోజువారీ సమస్యలు అనేకం తీరిపోతాయని అన్నారు. ఎన్నికలు సమీపించినప్పుడల్లా అన్ని పార్టీల నేతలు హామీలు గుప్పిస్తారని, ఆ తర్వాత ఆ ఊసే వుండదని గంగా దేవి అనే గ్రామవాసి విమర్శించారు. దేశం కోసం పోరాడేందుకు నలుగురు స్వాతంత్య్ర సమరయోధులను ఈ ఊరు పంపింది. అయినా ఈ ఊర్లో విద్య,వైద్య, బ్యాంకింగ్ సదుపాయాలు లేవని మరో గ్రామవాసి తారాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు కూడా కొరవడడంతో 65శాతం గ్రామస్తులు ఊరొదిలి వెళ్లిపోయారు. రాష్ట్రం ఏర్పడడానికి ముందు వున్న 71 కుటుంబాల్లో ఇప్పుడు 25 కుటుంబాలే మిగిలాయని చౌరాకోటి తెలిపారు. సరైన రోడ్డు లేకపోవడంతో ఉద్యోగులు లేదా టెక్నీషియన్లు ఎవరూ కూడా రావడానికి ఆసక్తి చూపకపోవడంతో చిన్న చిన్న అవసరాలు కూడా తీరడం లేదన్నారు. చిన్నపాటి సమస్య వచ్చినా నెలల తరబడి వేచి వుండాల్సి వస్తోందన్నారు.