Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబానీ-అదానీ వంటి దిగ్గజాలపై అదనపు పన్ను వేయండి
- సర్కారు ఖజానాకు ఏటా 5.85 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది..
- దేశంలోని 24 నగరాల్లో 84 శాతం మంది ప్రజల అభిప్రాయం.ఎఫ్ఐఏ సర్వే
పేదలు పూటకు గతిలేకపస్తులుంటేంటే...పెద్దలు మాత్రం ఏ కాలమైనా కోట్లు పోగేసుకుంటున్నారు. ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా..సామాన్యుడే బకరాగా మారుతుంటే.. అంబానీ-అదానీ లాంటి శతకోటీశ్వరుల జోలికి వెళ్లటానికి మోడీ ప్రభుత్వం ససేమిరా అంటోంది. కరోనా మహమ్మారిలోనూ తమ సంపదను పోగేసుకున్న ధనికులనుంచి అదనపు పన్ను వసూలు చేయాలన్న డిమాండ్ ఎక్కువవుతోంది. సూపర్ రిచ్‌లపై కరోనా సెస్ పన్ను, ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారిపై సంపద పన్ను విధించాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ మోడీ సర్కార్ మాత్రం కార్పొరేట్లకు ఓ న్యాయం..సామాన్యప్రజలకు మరో న్యాయం అన్నతీరుగా వ్యవహరిస్తోందన్న చర్చ నడుస్తున్నది. దీనిపై ధనవంతులనుంచి అదనపుపన్ను ముక్కుపిండి వసూలు చేయాల్సిందనని24 నగరాల్లో సేకరించిన ప్రజాభిప్రాయం మేరకు 84 శాతం మంది నొక్కి చెప్పారు.
న్యూఢిల్లీ : సామాన్య,మధ్యతరగతి బతుకుల్లో బడ్జెట్లు వెలుగునింపటంలేదు. కానీ కరోనా విరుచుకుపడినా..ఎలాంటి ప్రకృతి విపత్తులు, ఇతర భారాలు పడినా..అవి కార్పొరేట్లకు తాకవు. అన్నట్టు మోడీ ప్రభుత్వం మెహర్బానీ చాటుకుంటోంది. వాస్తవానికి మహమ్మారిలో కేంద్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై ఎడాపెడా పన్నులు పెంచింది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ (లీటర్) ధర రూ.100 దాటగా, ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1000కి చేరింది.
వీటికి తోడు నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి. జేబు బరువు పెరగకపోగా..కనీసం బతకటానికి అవసరమైన పైసలు కూడా కరువవుతున్నాయి. కరోనా కాలంలో అయితే..ప్రాణాలతో బయటపడ్డామని ప్రజలు అనుకోవటం మినహా మరే విధంగా నిలదొక్కుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలపై మరింత భారం పడకుండా ధనికుల నుంచి అదనపు పన్ను తీసుకుని పేదలకు పరిహారం గా ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న ప్రజలు డిమాండ్ చేశారు.
ప్రజా డిమాండ్ ఏమిటీ..? ఏఏ దేశాల్లో సంపద పన్ను విధిస్తున్నది..?
బడ్జెట్ 2022కి ముందు.. ఫైట్ ఇనీ క్వాలిటీ అలయన్స్ ఇండియా (ఎఫ్ఐఏ ) దేశంలోని 24 నగరాల్లో సర్వే నిర్వహించింది. కరోనా కాలంలో డబ్బు సంపాదించే ధనికుల నుంచి అదనపు పన్ను వసూలు చేయాలని 84 శాతం మంది ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కరోనా కాలంలో అసమానతలు చాలా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే చర్యలు చేపట్టాలన్న డిమాండ్ ఎక్కువైంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పేరుతో అదనపు భారాలు వేయకుండా సంపన్నుల నుంచి అదనపు పన్ను వసూలు చేయాలని కోరుతున్నారు. ఇలా వసూలు చేసిన పన్నులను ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలనకు వినియోగించాలని ప్రస్తావించారు.
సంపద పన్ను లేదా సూపర్ రిచ్ టాక్స్ అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం మొత్తం సంపదపై పన్ను విధిస్తే దానిని సంపద పన్ను అంటారు. 2015 వరకు..ఒక వ్యక్తి పేరు మీద రూ. 30 లక్షల వరకు ఆస్తి కలిగి ఉంటే, అతను 1 శాతం పన్ను చెల్లించాలి. 2016 బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ సంపద పన్ను ద్వారా ఖజానాకు రూ.1008 కోట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. అందువల్ల దీన్ని రద్దు చేశారు.
దేశంలో స్థిర ఆదాయం కంటే ఎక్కువ సంపాదించే ధనవంతుల నుంచి అదనపు పన్ను వసూలు చేస్తే, దానిని సూపర్ రిచ్ ట్యాక్స్ అంటారు. 2019... విదేశీ పెట్టుబడిదారులపై సూపర్ రిచ్ చార్జీ విధించిన కొద్ది రోజుల తర్వాత, భారత ప్రభుత్వం దానిని ఉపసంహరించుకున్నది.
కరోనా కాలంలో ధనికుల సంపద రెట్టింపు
2020 మార్చి.. 2021 నవంబర్ మధ్య, దేశంలో దాదాపు 100 మంది ధనవంతుల సంపద రూ.25.05 లక్షల కోట్ల నుంచి రూ.53.92 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ధనికుల సంపద 150 రెట్లు వేగంగా పెరిగింది.ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం ఈ కరోనా కాలంలో ధనవంతులు మరింత ధనవంతులయ్యారు, పేదలు పేదలుగా మారారు. గౌతమ్ అదానీ సంపద మార్చి 2020 నుంచి నవంబర్ 2021 వరకు మహమ్మారిలో మూడు రెట్లు పెరిగింది. ఈ సమయంలో, ముకేశ్ అంబానీ సంపద 35 శాతం పెరిగి రూ.7.50 లక్షల కోట్లకు పైగా ఉంది.
ఇక కరోనా రెండవ వేవ్ సమయంలో..దేశంలోని వివిధ రంగాలలో సుమారు కోటి మంది ప్రజలు నిరుద్యోగులుగా మారారు. అంతేకాదు 97 శాతం కుటుంబాల ఆదాయం తగ్గింది. 2020లో దాదాపు 4.6 కోట్ల మంది భారతీయులు పేదలుగా మారారు. మరోవైపు దేశంలోని బిలియనీర్లు తమ సంపదను వేగంగా పెంచుకుంటున్నారు. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ , భారత్ బయోటెక్ ల ఆదాయం కూడా 2000 శాతం నుంచి 4000 శాతానికి పెరిగింది.
సంపద పన్ను ఆదాయాలతో ప్రయోజనం..?
రూ. 37.52 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్న వారిపై 2 శాతం, ఆస్తులను బట్టి, సంపద పన్ను శాతాలను పెంచాలని ఎఫ్ఏఐ నివేదిక వెల్లడించింది.
ఇదే జరిగితే ఖజానాకు ఏటా కనీసం రూ.5.85 లక్షల కోట్లు వస్తాయి. ఉదాహరణకు... ఈ డబ్బు పేదరికం,సంపద మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ డబ్బుతో, ఆరోగ్య బడ్జెట్ 271 శాతం పెరుగుతుంది.
ప్రపంచంలోని ఐదు దేశాల్లో సంపద పై పన్ను ?
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద పన్ను వసూలు చేసే దేశాలను పరిశీలిస్తే.. పోర్చుగల్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ అత్యధిక పన్ను 61.3 శాతం. స్లోవేనియా 61.1 శాతంతో రెండవ స్థానంలో ఉంది. భారత్‌లో సంపద పన్ను 1950 నుంచి 2015 వరకు విధించింది, అయితే తక్కువ ఆదాయాన్ని పేర్కొంటూ మోడీ ప్రభుత్వంలోని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాన్ని తొలగించారు. దీని వెనుక బీజేపీ,కార్పొరేట్ల అనుబంధం పరోక్షంగా కాషాయపార్టీకి విరాళాల రూపంలో సమర్పించుకుంటున్నారు.
ఆయా దేశాలపై ఆదాయాలపై పన్నుల వసూళ్ల తీరు..?
ఇక సంపద పన్ను మినహాయించి..ఆదాయాలపై పన్ను వసూలు చేయడంలో జపాన్ ముందంజలో ఉంది. సంపాదించేవారిపై జపాన్‌లో అత్యధికంగా 55 శాతం, దక్షిణ కొరియాలో 50 శాతం, ఫ్రాన్స్‌లో 45 శాతం,యూకేలో 40 శాతం, యూఎస్‌లో 40 శాతం పన్ను స్లాబ్‌లు అత్యధికంగా ఉన్నాయి. ఈ దేశాల్లో విద్య, వైద్యం ఉచితం కాబట్టి... ఆ రెండింటిపై ప్రజల ఖర్చు చాలా తక్కువ.
భారత్‌లో ఎలాగంటే..?
దేశంలో ఆదాయాలపై అత్యధికంగా 30 శాతం పన్ను విధించబడుతుంది. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశంలో ఉద్యోగాలు లేదా వ్యాపారం చేస్తున్న వారి నుంచి 30 శాతం పన్ను వసూలు చేస్తారు.
దేశంలో పెరుగుతున్న అసమానతలపై నిపుణులు వాదన.!
సామాజిక అసమానతలు తిరుగుబాటు పరిస్థితికి దారితీస్తాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే దానిని ఎదుర్కోవటానికి కేంధ్రం ప్రయత్నాలు చేయాలి. అసమానత కారణంగా ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉంది. దీంతో మార్కెట్లోనూ, దేశంలోనూ డిమాండ్ పెరగడం లేదని నిపుణలు విశ్లేషిస్తున్నారు.