Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను మోసం చేసిన మోడీ సర్కార్
- రాజ్యాంగపరమైన బాధ్యతతో హెచ్చరించండి : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎస్కేఎం లేఖ
న్యూఢిల్లీ : దేశంలో రైతులను మోడీ సర్కార్ మోసం చేసిందని, రాజ్యాంగపరమైన బాధ్యతతో హెచ్చరించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కోరింది. ఈమేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎస్కేఎం వినతిపత్రం పంపింది. రైతులకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఎస్కేఎం సోమవారం దేశవ్యాప్తంగా ''విద్రోహ దినం'' ఆందోళనకు పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా రాష్ట్రపతితో పాటు దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఎంఆర్వోలకు రైతులు వినతిపత్రం ఇచ్చారు.
వినతిపత్రంలో కీలక అంశాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిన ద్రోహంపై విశ్వస్ఘాత్ దివస్ దేశవ్యాప్తంగా నిర్వహించామని తెలిపింది. ''సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) దేశంలోని రైతులు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించు కోవాలని, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని, ఇతర డిమాండ్లకు వ్యతిరేకంగా అపూర్వమైన ఉద్యమాన్ని చేయడం మీకు తెలుసు. ఈ ఉద్యమం వల్ల మీ సంతకంతో మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యాయి. ఆ తర్వాత ఆరు పెండింగ్ సమస్యలపై 2021 నవంబర్ 21న ప్రధానమంత్రికి ఎస్కేఎం లేఖ రాసింది. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజరు అగర్వాల్ 2021 డిసెంబర్ 9న ఎస్‌కేఎంకు లేఖ రాశారు. అందులో ఆయన ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలపై ప్రభుత్వం ఉద్యమాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాతపూర్వక హామీ ఆధారంగా సంయుక్త కిసాన్ మోర్చా డిసెంబరు 11 నుండి ఢిల్లీ సరిహద్దులను, అనేక ఇతర ఆందోళన ప్రాంతాలను నిలిపివేయాలని నిర్ణయించింది'' అని తెలిపింది.
''మరోసారి దేశంలోని రైతులు మోసపోయారని తీవ్ర విచారం, వేదనతో మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం డిసెంబర్ 9 నాటి లేఖలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అందుకే దేశవ్యాప్తంగా రైతులు జనవరి 31న విశ్వాసఘాత్ దివస్ (విద్రోహ దినం) పాటించాలని నిర్ణయించుకున్నారు'' అని పేర్కొంది. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూడండని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఎస్కేఎం తెలిపింది.
''ఈ రైతుల ఉద్యమానికి సంబంధించి నమో దైన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభు త్వం ఇతర రాష్ట్రాలకు కూడా విజ్ఞప్తి చేస్తుందని తెలి పింది. కాని వాస్తవమేమిటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క లేఖ కూడా రాష్ట్రాలకు పంపలేదు'' అని తెలిపింది. '' ఎంఎస్పిపై ప్రధాన మంత్రి స్వయంగా, ఆ తరువాత వ్యవసాయ మంత్రి ఒక కమిటీని ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని రైతులు ఎంఎస్పిని ఎలా పొందాలనేది కమిటీ ఆదేశాలలో ఒకటి. వాస్తవం ఏమిటంటే, ప్రభుత్వం ఈ అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించలేదు. కమిటీ స్వభావం, దాని పనితీరు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు'' అని పేర్కొంది.
విద్రోహ దినం విజయవంతం
చారిత్రాత్మక రైతు ఉద్యమానికి దిగొచ్చిన మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చిన దేశవ్యాప్తంగా రైతుల విద్రోహ దినం విజయవంతం అయింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, జిల్లా కలెక్టర్లు, ఎంఆర్వోలకు రైతులు వినతిపత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా దిష్టి బొమ్మల దహనం, ధర్నాలు, మానవహారాలు జరిగాయి. దేశం అంతటా వందలాది జిల్లాలు, బ్లాక్‌లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, కేరళ, జార్ఖాండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. 2021 డిసెంబర్లో నిరసన తెలుపుతున్న రైతులకు చేసిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతూ ఉంటే, రైతులు తమ ఆందోళనను పు న :ప్రారంభించడం మినహా మరో మార్గం లేదని ఎస్ కె ఎం స్పష్టం చేసింది.