Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్‌పై సీఐటీయూ నిరసన
న్యూఢిల్లీ : వాగాడంబరం తప్ప కార్యాచరణలో కలిసివచ్చిందేమీ లేదని కేంద్ర బడ్జెట్‌పై సీఐటీయూ వ్యాఖ్యానించింది. కోవిడ్‌తో భారీగా కోల్పోయిన ఉపాధులు, ఆదాయాలకు గండి, పెరుగుతున్న పేదరికం, ధరల పెరుగుదల వంటి సమస్యల మధ్య నలుగుతున్న సామాన్యుని పట్ల కాస్తయినా కనికరం లేని రీతిలో ఈ బడ్జెట్ వ్యవహరించిందని విమర్శించింది. మరోవైపు కార్పొరేట్ మాస్టర్లకు ఉదారంగా రాయితీలిస్తున్నారని విమర్శించింది. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేదిగా ఈ బడ్జెట్ వుందని విమర్శించారు. ఈ విధ్వంసకర విధాన వ్యవస్థను కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించాలని, దేశవ్యాప్తంగా సమైక్య పోరాటాల ద్వారా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గానికి సామాజిక భద్రతా పథకాన్ని సార్వజనీనంగా విస్తరించాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ ఈ బడ్జెట్లో దాని వూసే లేదన్నారు. బదులుగా పరోక్ష పన్నుల ద్వారా భారాన్ని మోపేందుకు యత్నించిందన్నారు. జాతీయాదాయాలను సమకూర్చే ఆస్తులు, వనరులన్నింటినీ ప్రయివేటు పెట్టుబడిదారులకు యథేచ్ఛగా బదలాయించడానికి మోడీ ప్రభుత్వం సిద్దపడుతోందని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవాలని కార్మిక వర్గాన్ని కోరారు.