Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు మోయాల్సిందే...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర బడ్జెట్ వడ్డీ రాయితీకి ఎసరు పెట్టింది. రుణమాఫీ సకాలంలో చేయకపోవడంతో రైతులకు వడ్డీ పెరిగిపోయింది. కేంద్రం రుణమాఫీతోపాటు వడ్డీ రాయితీ కూడా ఇస్తుందనే ఆశలు గల్లంతయ్యాయి. గతేడాది రుణమాఫీ కోసం రూ 18,142 కోట్లు కేటాయించిన సర్కారు...ఈ బడ్జెట్లో రూ 19,500 కోట్లు కేటాయించింది. గత కంటే ఇది రూ, 1,358 కోట్లు అదనం. అయినప్పటికీ వడ్డీ రాయితీ భారం రైతుపై తీవ్రమవుతున్నది. ఈ విషయాన్ని బడ్జెట్ విస్మరించింది. దీని ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుంది. తెలంగాణలో రూ. లక్ష రుణమాఫీకి రూ 25వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ 732 కోట్లు విదిల్చి చేతులు దులుపుకుంది. రుణమాఫీపై వడ్డీ సుమారు రూ 800 కోట్లు ఉంటుంది. అందులో 3 శాతం కేంద్రం, 4 శాతం రాష్ట్రం, రైతు ఒక శాతం భరించాలనే నిబంధన ఉన్నది. తాజాగా కేంద్రం భరించాల్సిన వడ్డీ రాయితీకి నిధులు కేటాయించలేదు. దీంతో రాష్ట్ర రైతాంగంపై దాదాపు రూ 300 కోట్ల భారం పడనుంది. రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇప్పటికే బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం రుణమాఫీ విడతలవారీగా చేయడంతో వడ్డీ రైతులపై పడుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ కూడా వారిపై వడ్డీ రాయితీని రైతులకే వదిలేసింది. దీంతో బ్యాంకుల్లో వడ్డీలకు వడ్డీ పెరిగిపోతున్నది. పంటలకు ఇవ్వాల్సిన రుణ పరిమితి మించిపోవడంతో వడ్డీ చెల్లిస్తేనేగానీ కొత్త రుణం ఇవ్వడం లేదు. దీంతో రైతులు అన్ని విధాల నష్ట పోతున్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకుగానూ రూ 26వేలకోట్లు అప్పులు ఉన్నాయి. వాటికి వడ్డీ రాయితీ కేటాయించకపోవడంతో రాష్ట్రం కూడా చేతులెత్తేసే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ సకాలంలో చేయకపోవడంతో రైతులకు రుణభారం పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు బ్యాంకులు రుణం నిరాకరణ చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని రైతులు వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వడగండ్ల వానలు, వైరస్ తదితర కారణాలతో పంటలు దెబ్బతింటున్నాయి. పంట చేతికి రాక అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా వ్యవసాయం మరింత సంక్షోభంలోకి పోయే ప్రమాదం ఉన్నదని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.