Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కక్షసాధింపు చర్యలే..ఏఐకేఎస్
న్యూఢిల్లీ : ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) విమర్శించింది. రైతుల నిజమైన డిమాండ్లను ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, సేకరణ, ఆహార, ఎరువుల సబ్సిడీలకు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో కోతలు విధించారని విమర్శించింది. రైతాంగం సాగించిన సుదీర్ఘకాల పోరాటానికి కక్షసాధింపు చర్యలుగా ఈ బడ్జెట్ కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. రైతులకు గానీ, వ్యవసాయ కూలీలకు గానీ ఎలాంటి ఉపశమన చర్యలు లేవు. రుణాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలని చేసిన డిమాండ్ల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని మండిపడింది. ఈ మేరకు ఏఐకేఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2021-22లో మొత్తం కేటాయింపులు రూ.4,74,750.47 కోట్లుగా (సవరించిన అంచనాలు) వుండగా, ఈసారి లక్ష కోట్లకు పైగా క్షీణించి రూ.3,70,303 కోట్లుగా వుంది. ఇక గ్రామీణాభివృద్ధి రంగం వాటా 5.59శాతం నుండి 5.23శాతానికి పడిపోయింది. పంట బీమా, ఆహార, ఎరువుల సబ్సిడీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో కూడా భారీగా కోతలు విధించారని విమర్శించింది. 2022-23 సంవత్సరానికి వరి, గోధుమ సేకరణ కోసం రూ.2.37 లక్షల కోట్లు పక్కన పెట్టినట్లు ఆర్థిక మంత్రి పెద్దగా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నించారని తెలిపింది. వాస్తవానికి, గతేడాది చేసిన రూ.2.48లక్షల కోట్ల కేటాయింపుల కన్నా ఇది తక్కువేనని ఏఐకేఎస్ పేర్కొంది. లబ్ధిదారుల సంఖ్య కూడా గతేడాది కన్నా గణనీయంగా తగ్గిపోయిందని తెలిపింది. గత సంవత్సరం 1.97కోట్ల మంది లబ్దిదారులు వుండగా, ఈసారి ఆ సంఖ్య 1.63 కోట్లకి పడిపోయింది. అన్ని పంటలకు విస్తరించి, లబ్దిదారుల సంఖ్యను పెంచాలని కోరుతుండగా, అందుకు విరుద్ధంగా జరిగిందని ఆ ప్రకటన విమర్శించింది. కేటాయింపులు తగ్గడం, ద్రవ్యోల్బణం కలిసి 2022-23లో సేకరణ గణనీయంగా తగ్గడానికి దారితీస్తుందని హెచ్చరించింది. ఎరువుల సబ్సిడీకి కేటాయింపులు కూడా 25శాతం మేర తగ్గించారని, దీనివల్ల ఇప్పటికే పెరుగుతున్న ఎరువుల ధరలపై ఇది మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. కరోనా సమయంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన వేళ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపులు తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అసమానతలను, దారిద్య్రాన్ని పెంచడానికి, నిరుద్యోగం, ఆకలి పెరగడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని హెచ్చరించింది. మోడీ ప్రభుత్వ విధానాలను, ధోరణిని నిరసిస్తూ అన్నివర్గాలను కలుపుకుని పోరాటాలు జరపాల్సిందిగా శాఖలకు పిలుపునిచ్చింది.