Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.39,44,909 కోట్లతో 2022-23 బడ్జెట్
- రక్షణరంగం సహా.. అన్నింటా ప్రయివేటీకరణకు పెద్దపీట
- ఎల్ఐసీలో వాటాల అమ్మకం ద్వారా రూ.లక్ష కోట్లు సమీకరణ!
- 'నరేగా' పథకానికి భారీగా నిధుల కోత
- కోవిడ్ సంక్షోభం ముంగిట ప్రజాఆరోగ్యానికి కేవలం రూ.200కోట్లు పెంపు
- వ్యవసాయం, విద్య, వైద్యానికి దక్కని ప్రాధాన్యత
- నిరుద్యోగం, అభివృద్ధి, రైతాంగ సమస్యలు, సంక్షేమం..వేటినీ ప్రస్తావించని బడ్జెట్
- ఆదాయ పన్ను శ్లాబులు యథాతథం.. వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి
- ఆర్థిక లోటు రూ.16,61,196కోట్లు.. మరోవైపు పథకాలు, ప్రకటనలు ఘనం
కేంద్ర బడ్జెట్ 2022-23పై వివిధ వర్గాల ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. రెండేండ్లుగా కరోనా కష్టాలతో అతలాకుతలమైన పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఊరటనివ్వలేదు. రైతు సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి, విద్య, వైద్యం, అణగారిన వర్గాల సంక్షేమం ప్రస్తావన తీసుకురాలేదు. కోవిడ్‌తో దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రమకు ప్రత్యేక ఉద్దీపన అసలే లేదు. మొత్తంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 92 నిమిషాల బడ్జెట్ ప్రసంగం తీవ్రంగా నిరాశపర్చింది. ఎల్ఐసీ, రైల్వేలు, చమురు సంస్థలు, జాతీయ రహదార్లు, విద్యుత్, బొగ్గు..ఇలా అన్ని రంగాల్లో ఆస్తుల అమ్మకం వేగవంతం చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. సంపన్నులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ అనుకూల విధానాలు కొనసాగుతాయని ప్రకటించుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా మోడీ సర్కార్ నిలుస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ : 2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 39 లక్షల 44వేల 909 కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాలను దేశం ముందు ఉంచారు. ఎంతగానో ఎదురుచూసిన దేశ రైతాంగానికి కొత్త కథ వినిపించారు. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయరంగానికి ఊతమిస్తామని, హైటెక్ వ్యవసాయమని తాజా బడ్జెట్లో నిర్మలమ్మ కీలక ప్రకటనలు చేశారు. మరోవైపు గ్రామీణ ఉపాధికి, వ్యవసాయ కూలీలకు కీలకమైన 'నరేగా' (ఉపాధి హామీ పథకం)కు నిధులు భారీగా తగ్గించారు. గత బడ్జెట్లో రూ.98కోట్లు ప్రకటించగా..ఈసారి కేవలం రూ.73వేల కోట్లు ఇస్తామన్నారు. కోవిడ్ సంక్షోభంతో దేశం యావత్తు ఎంతలా ప్రభావితమైందో..అందరమూ చూస్తున్నాం.
ఇంత జరుగుతున్నా..ప్రభుత్వ వైద్యానికి నిధుల కేటాయింపు పెరగలేదు. మౌలిక వసతుల కల్పన పూర్తిగా విస్మరించింది. ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రయివేటు చేతుల్లోకి నెట్టేసింది. సవరించిన 2021-22 బడ్జెట్‌తో పోల్చితే కేవలం రూ.200కోట్లు పెంచుతూ ఈసారి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.86,200కోట్లు కేటాయించింది. దేశ రైతాంగం మునుపెన్నడూ లేనంత సంక్షోభంలో చిక్కుకోగా, కేంద్రం వ్యవసాయరంగానికి రూ.980కోట్లు పెంచి చేతులు దులుపుకుంది. గత బడ్జెట్లో రూ.1,31,531కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.1,32,513కోట్లు ప్రకటించింది. పీఎం కిసాన్ పథకానికి కూడా నిధుల కేటాయింపు పెంచలేదు. గత బడ్జెట్ (సవరంచిన అంచనాల ప్రకారం) వ్యయం రూ.67,500కోట్లుకాగా, ఈసారి రూ.68వేల కోట్లు కేటాయించింది.
బడ్జెట్ ముఖ్యాంశాలు
ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ఆదాయ పన్ను శ్లాబులు మారుతాయని ఎంతగానో ఎదురుచూసిన వేతన జీవులు మరోసారి నిరాశపడ్డారు. పన్ను మినహాయింపుపై కేంద్రం ఎటువంటి ప్రకట నా చేయలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను టారీఫ్‌ల వివరాలు వెల్లడించలేదు. దాంతో వేతన జీవులు బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే మూడేండ్లలో మరో 400 వందే భారత్ రైళ్లను తీసుకురానున్నట్టు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలు, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత్ రైళ్లను మరిన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు.
విద్యార్థుల కోసం 'వన్ క్లాస్..వన్ టీవీ' తీసుకు వస్తామన్నారు. 'ప్రధాని ఈ-విద్య' కార్యక్రమం ద్వారా అనుబంధ విద్య విధానాన్ని విస్తరిస్తామన్నారు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్ ఛానళ్లు ఉండగా..వీటిని 200 ఛానళ్లకు పెంచుతున్నామన్నారు.
క్రిప్టో కరెన్సీని గుర్తించటం లేదని స్పష్టంగా ప్రకటించిన కేంద్రం, ఇప్పుడు ఆ కరెన్సీ లావాదేవీలపై 30శాతం పన్ను విధించింది. డిజిటల్ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై ఈ 30శాతం పన్ను ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం టీడీఎస్ విధించారు.
ప్రయివేటుకు అమ్ముడే..
తాజా బడ్జెట్ ప్రతుల్లో 2022 పెట్టుబడుల ఉపసంహరణ అంచనాలను సవరించింది. వీటిని పరిశీలిస్తే.. ఎల్ఐసీ ప్రయివేటీకరణేగాక, ఈ ఏడాది మరో పెద్ద ఐపీవో ఉంటుందని తెలుస్తోంది. జాతీయ సంపద, వనరుల అమ్మకం (జాతీయ నగదీకరణ) మరింత వేగవంతం చేసే ఉద్దేశం కనపడింది. ఈబడ్జెట్లో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా రూ.65వేల కోట్లు సమీకరించటం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎల్ఐసీ ఐపీవోతో రూ.45వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉన్నట్టు అంచనాలున్నాయి. భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయివేటీకరణ, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక ప్రభుత్వ బీమా కంపెనీ సంబంధించిన విక్రయాలు వేగవంతం కానున్నాయని తెలిసింది.
పెరిగేవి
- అన్ని దిగుమతి వస్తువులు
- ఇమిటేషన్ జ్యుయలరీ
- స్పీకర్, హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్
- సోలార్ సెల్స్ అండ్ మాడ్యుల్స్
- ఎక్స్‌రే మిషన్లు
- గొడుగులు
- అన్‌బ్లెండెడ్ ఫ్యూయల్
తగ్గేవి
- కెమెరా ఫోన్లు
- స్మార్ట్ వాచ్‌లు,
- ఇయరింగ్ ఎయిడ్స్ (వినికిడి పరికరాలు)
- వ్యవసాయ ఉపకరణాలు
- రత్నాలు, వజ్రాలు
- స్మార్ట్ మీటర్లు
- పెట్రోలియం శుద్ధి రసాయనాలు
- కోకాబీన్స్, ఇంగువ
- బట్టలు
భవిష్యత్తును నిర్దేశించేది : ప్రధాని
ఇది ప్రజలకు స్నేహపూర్వకమైనది. ప్రగతిశీలమైనది. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాలకు నూతన అవకాశాలను తీసుకొచ్చే బడ్జెట్ ఇది. గడిచిన వందేళ్లలోనే అతిపెద్ద భయానక విపత్తు కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి పట్ల నూతన ఆత్మవిశ్వాసాన్ని ఈ బడ్జెట్ తీసుకొచ్చింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఈ బడ్జెట్ సామాన్యులకు అనేక నూతన అవకాశాలను సృష్టిస్తుంది.
ప్రజా వ్యతిరేకం : ఏచూరి
ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్. ఈ బడ్జెట్ ఎవరి కోసం 10 శాతం ధనవంతులు.. 75 శాతం సంపదను కలిగి ఉన్నారనీ, 60 శాతం పేదల వద్ద 5 శాతం మాత్రమే సంపద ఉంది. మహమ్మారి సమయంలో భారీగా డబ్బులు గడించిన వారిపై పన్నులు ఎందుకు వేయలేదు, నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరిగిన నేపథ్యంలో.. ధనవంతులకు ఎక్కువ పన్ను విధించాలనిపించలేదా?'
గుండు సున్నా బడ్జెట్ : రాహుల్
జీరో సమ్ బడ్జెట్ (గుండు సున్నా బడ్జెట్). మోడీ ప్రభుత్వ బడ్జెట్ మొత్తం శూన్యం. ఇందులో వేతన జీవులు, మధ్యతరగతి, పేద, అణగారిన వర్గాలకు, యువతకు, రైతులకు, చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమలకు ఏమీ లేదు. అచ్చేదిన్ మరింత దూరంగా నెట్టివేయబడిందని, మధ్యతరగతికి ఉపశమనం లేదు'.