Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయి. కోవిడ్ కారణంగా దేశ ఆరోగ్య రంగంపై తీవ్రంగా భారం పడినా ఈసారి బడ్జెట్లో ఆమేర కేటాయింపులేవీ పెద్దగా పెరగలేదు. కేవలం రూ.200 కోట్లు పెంచి సరిపెట్టేశారు. గ్రామీణా భివృ ద్ది రంగంపై శీతకన్ను వేశారు. ఉపాధి లేక జనం అల్లాడుతున్నా, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచలేదు. కరోనా, నిరుద్యోగం కార ణంగా ప్రజల ఇబ్బందులు పెరిగినా ప్రభుత్వం ఆహా ర సబ్సిడీల మొత్తాలను పెంచకపోగా తగ్గించింది.
విద్య : కోవిడ్ మహమ్మారి దీర్ఘకాలం కొనసాగుతుండడంతో గత రెండేళ్లుగా పాఠశాలలు, కాలేజీలు మూతపడడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులకు కష్టకాలమని చెప్పవచ్చు. చదువుకోవడానికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయని, ఫలితంగా అంతరాలు పెరిగాయని సర్వేల్లో వెల్లడైంది. కోవిడ్‌తో ఆన్లైన్ తరగతులు పెట్టడంతో చాలామంది విద్యార్ధులకు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరయ్యే అవకాశాలు కూడా లేకపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విద్యా రంగానికి రూ.93,224 కోట్లు కేటాయించగా, ఖర్చు పెట్టింది రూ.88,002 కోట్లుగానే వుంది. సెకండ్‌వేవ్ లాక్డౌన్ వల్ల ఎదురయ్యే సవాళ్ల కారణంగా ఈ ఖర్చు తగ్గినందున, రాబోయే విద్యా సంవత్సరంలో విద్యా రంగంపై కేంద్రం ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ వ్యయం మరింత కీలకంగా మారింది. ఈ ఏడాది విద్యా రంగానికి రూ.1,04,278 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ కారణంగా పాఠశాలలు తిరిగి యథావిధిగా పనిచేస్తాయో లేదో, విద్యార్థులు తరగతులకు హాజరయ్యే పరిస్థితి వుందో లేదో చూడాల్సి వుంది.
ఉపాధి హామీ పథకం : రెండేళ్లుగా కోవిడ్ కారణంగా నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) కింద పని కోసం డిమాండ్ పెరిగిపోతోంది. ఈ పథకానికి తగినన్ని నిధులు కేటాయించకపోతే ఈ రంగం కింద తగినన్ని అవకాశాలు కల్పించడం సాధ్యం కాదని, చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతుందని హక్కుల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
గతేడాది ఈ రంగానికి కేటాయించిన నిధులు సరిపడా లేవు. ఈ పథకానికి రూ.73,000 కోట్లు ఖర్చు పెట్టాలని లెక్కలు వేశారు, కానీ రూ.98 వేల కోట్లు లెక్క తేలింది. అయిప్పటికీ, ఈసారీ ఈ పథకానికి గతేడాది మాదిరిగానే రూ.73వేల కోట్లే కేటాయించారు.
గ్రామీణాభివృద్ధి : గతేడాది వ్యయం పెరిగినప్పటికీ ప్రభుత్వం ప్రణాళికా వ్యయం పెంచని మరో రంగం గ్రామీణాభివృద్ధి రంగం. వచ్చే ఏడాదికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1,38,203.63 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రంగానికి ఖర్చు పెట్టిన మొత్తమే రూ.1,55,042.27 కోట్లుగా వుంది.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం : భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ మూడో దశ నడుస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా దేశంలోని ఆరోగ్య సంరక్షణా సేవల రంగం తీవ్రంగా ప్రభావితమైంది. గత సంవత్సరం కేటాయించిన దానికన్నా కేంద్రం ఎక్కువ మొత్తాలను ఈ రంగంపై ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు స్వల్పంగా కేటాయింపులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం (రూ.86,000.65 కోట్లు) పై కొద్దిగా పెంచుతూ రూ.86,200.65 కోట్లు కేటాయింపులు చేశారు.
ఆహార సబ్సిడీలు : ప్రభుత్వ పంపిణీ వ్యవస్థతో కూడిన ఆహార సబ్సిడీల రంగానికి బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఈ రంగానికి గతేడాది కేటాయింపులు పెరిగాయి.
దాంతో ఇప్పుడు తగ్గించారు. గతేడాది ఆహార సబ్సిడీలపై ప్రభుత్వం రూ.2,99,354.6 కోట్లు ఖర్చు చేసింది. అందుకని ఈ ఏడాది చాలా తక్కువ మొత్తాన్ని రూ.2,07,291.1 కోట్లు ఖర్చు చేయాలని భావించింది.
కిసాన్ : పీఎం కిసాన్‌కు కేటాయింపులు గతేడాది మాదిరిగానే దాదాపు ఈసారీ ఉన్నాయి. రైతులకు నిర్దిష్టంగా కొంత మొత్తం అందించే ఈ పథకానికి రైతులసంఖ్య మారదు కాబట్టి కేటాయింపులు మారవు. వారికిచ్చే మొత్తాలు కూడా పెంచడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 2019-20 తాత్కాలిక బడ్జెట్లో ప్రారంభించిన పిఎం-కిసాన్ బదలాయింపుల వాస్తవిక విలువ 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 15.5శాతం మేర క్షీణించింది.
పీఎం పోషణ్-మధ్యాహ్న భోజన పథకం
గతేడాది సవరించిన వ్యయం (రూ.10,234 కోట్లు) మాదిరిగానే ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకం లేదా పిఎం పోషణ్ పథకానికి నిధులు కేటాయింపులు జరిగాయి. గతేడాది ప్రణాళికా వ్యయం కన్నా ఇది తక్కువే. పాఠశాలలు తిరిగి తెరిచి, విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూస్తే, మధ్యాహ్న భోజన పథకమనేది చాలా కీలకమైన అంశం. పిల్లలకు మరింత మెరుగైన రీతిలో పోషకాహారం అందించడానికి తోడ్పడేది.