Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సిఎం పినరయి విజయన్ విమర్శ
తిరువనంతపురం : కోవిడ్ మహమ్మారి కారణంగా వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభాలకు ఆశించిన ఊరట, ఉపశమనం ఈ బడ్జెట్ ఇవ్వలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. మొత్తంగా ఈ బడ్జెట్ నిరాశ కలిగించిందన్నారు. ఆహార సబ్సిడీలను 28శాతం తగ్గించడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బలహీనపడుతుందని అన్నారు. ఎరువుల సబ్సిడీని 25శాతం మేర తగ్గించడం వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందన్నారు. మొత్తంగా కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. కేరళ ప్రతిసారీ లేవనెత్తుతున్న డిమాండ్లను, అత్యవసరాలను పరిష్కరించడంలో కేంద్ర బడ్జెట్ విఫలమైందన్నారు. కేరళ చేసిన ప్రతిపాదనలు, ఆర్థిక డిమాండ్లు అన్నీ పెడచెవిన పెట్టారని, మొత్తంగా కేరళ అభివృద్ధికి ఏ విధంగానూ దోహదపడేలా లేదన్నారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలకు మరింతగా సాయం అందాల్సిన వేళ కేంద్రం మొత్తంగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని విజయన్ విమర్శించారు. జిఎస్టి పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలన్న రాష్ట్రాల డిమాండ్‌ను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదన్నారు. రుణ పరిమితిని ఐదు శాతం పెంచాలన్న డిమాండ్‌ను కూడా ఆమోదించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు ప్రాజెక్టు ప్రతిపాదనలు కొన్ని బడ్జెట్లో ప్రతిబింబించడం సానుకూల అంశంగా ఉందన్నారు.