Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల పెరుగుదల అరికట్టలేదు
- రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు ఏది? : రాజ్యసభలో ప్రతిపక్షాలు
- వాస్తవాలను ప్రస్తావించలేదు : సీపీఐ(ఎం) ఎంపీ
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చటంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని రాజ్యసభలో ప్రతిపక్షాలు విమర్శించాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, రైతు ఆదాయం రెట్టింపు ఏమైందని ప్రశ్నించాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం వివిధ అంశాలపై వామపక్షాలు, కాంగ్రెస్, డీఎంకే మోడీ సర్కార్ తీరును తీవ్రంగా విమర్శించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ, ''అధికారంలోకి రావడానికి ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు చేసి.. అవన్నీ మరిచిపోయారు. ఇంధన ధరలు, నిత్యావసర సరుకుల ధరల్ని నియంత్రించటంలో కేంద్రం విఫలమైంది. క్షేత్రస్థాయిలో ఏమీ చేయకుండా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నది. పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువ. పరిశ్రమలు మూతపడుతున్నాయి. పెట్టుబడులు రావటం లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావటం లేదు'' అని అన్నారు. అఖిల భారత సర్వీసు నిబంధనల్లో మార్పులు తేవటంపై డీఎంకే ఎంపీ తిరుచి శివ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కుల్ని హరించేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. ఫెడరల్ దేశమన్న సంగతి మరిచారా? రాష్ట్రాల్ని సంప్రదించాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రశ్నార్థకంగా ప్రజాస్వామ్య వ్యవస్థ : సీపీఐ(ఎం)
దేశంలో ప్రాథమిక వాస్తవాలను రాష్ట్రపతి ప్రసంగంలో కనిపించలేదని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ బికాష్ రంజన్ భట్టాచార్య విమర్శించారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రాథమిక వాస్తవాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలో రైతులు ఏడాదికి పైగా ఆందోళన చేశారనీ, ప్రధాని మోడీ చట్టాలను రద్దు చేస్తూ క్యాబినెట్లో కూడా చర్చించకుండా మన్ కీ బాత్‌లో ప్రకటించారని, ఉభయ సభల్లో చర్చ కూడా నిర్వహించలేదని విమర్శించారు. ఇదేనా ప్రజాస్వామ్య ప్రక్రియ అని ప్రశ్నించారు. దీంతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారుతుందని విమర్శించారు. కరోనా అన్ని సమస్యలకు వ్యాక్సినేషన్ ఒక్కటే సమాధానమని ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. కరోనాతో పేదరికం పెరిగిందనీ, 33 కోట్లకు పైగా ప్రజలు బీపీఎల్ కిందకు చేరారని తెలిపారు. దీన్ని ఎలా అదిగమిస్తామనేది రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు. పేద ప్రజలకు ఆహారం అందించేందుకు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించిందనీ, ఇదే దేశంలోని వాస్తవ పరిస్థితి అని అన్నారు. గోడౌన్లలో బియ్యం ముక్కుతున్నాయనీ, కాని పేదలకు ఆహారం అందటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో పరిస్థితులపై అనేక అంతర్జాతీయ రిపోర్టులు వచ్చాయనీ, కాని రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదని అన్నారు. ఇటీవలి కాలం దేశంలో అసమానతలు పెరిగాయని, అలాగే ప్రపంచంలోని 50శాతం పేదలు ఇండియాకు చెందిన వారేనని, ఈ అంశాలు కనీసం ప్రస్తావించలేదని అన్నారు. దీన్ని అధిగమించేందుకు ఎలాంటి పథకాలు తీసుకొచ్చారో రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించలేదని విమర్శించారు. ఆదాయం కోల్పోవడంతో 80 శాతం కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ ప్రజల ఆదాయాలు పెంచేందుకు ఏ పథకం తీసుకొచ్చారు? అని ప్రశ్నించారు. దేశంలోని కొద్ది మంది బిలినియర్లు అయ్యారనీ, మెజారిటీ ప్రజలు బీపీఎల్‌కు దిగువన చేరారని అన్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక ఏంటీ? అని ప్రశ్నించారు. అసమానతలను ప్రస్తావించకపోతే దేశ ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని అన్నారు.
రాజ్యాంగ కలలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, కాని దానికి భిన్నంగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారని విమర్శించారు. దేశ సమాఖ్య వ్యవస్థను ద్వంసం చేస్తున్నారనీ, లౌకిక విధానంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. లౌకిక దేశంలో రామమందిర్ నిర్మాణం ప్రధాని బాధ్యతా..? అని ప్రశ్నించారు. రామ మందిర్, కాశీ విశ్వనాథ్ వెళ్లి అక్కడ హిందూ సంస్కృతి అనుసరించాలని చెబుతూ, మైనార్టీకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేయడం ప్రధాని బాధ్యతా అని ప్రశ్నించారు. రాజ్యాంగ అసెంబ్లీలో ఏం చర్చించారో ఒకసారి చూడండని హితవు పలికారు. దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల బాధ్యత ప్రభుత్వానిదని సూచించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామనీ, అయితే అదే సమయంలో ఆయన తత్వాన్ని అనుసరించాలని బీజేపీ నేతలకు సూచించారు. మైనార్టీల పట్ల గౌరవం ప్రదర్శించాలని నేతాజీ చెప్పారని గుర్తు చేశారు. అలాగే మైనార్టీలకు సమాన వాటా ఇవ్వాలని సూచించినట్టు తెలిపారు.