Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్‌పై ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్
న్యూఢిల్లీ : దేశంలో రోడ్డు రవాణా రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని కనీసం బడ్జెట్లో ప్రస్తావించనైనా ప్రస్తావించలేదంటూ ప్రభుత్వ వైఖరిని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) తీవ్రంగా ఖండించింది.ప్రయాణికుల,సరుకుల రవాణా రంగాలు రెండూ సంక్షోభంలో వున్నాయని,వాటి పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరింది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలో ఏ దేశానికైనా జీవనాడి వంటిది రవాణా రంగం. కానీ భారత్‌లో కోవిడ్‌కు ముందు నుండీ ఈ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనాన మహమ్మారితో ఆ సంక్షోభం మరింత ముదిరిందని,ఇందుకు మూడు ప్రధాన కారణాలు వున్నాయని సమాఖ్య పేర్కొంది. ఎక్సైజ్ సుంకాన్ని అసాధారణ రీతిలో పెంచడం, చమురు కంపెనీల ధరల పెంపు, ప్రతి ఏటా ఐఆర్డీఏ, బీమా ప్రీమియాన్ని అవాస్తవికంగా పెంచుతూ పోవడం, టోల్ ప్లాజాలు, టోల్ చార్జీలు పెరుగుతునే వుండడం కారణాలుగా వున్నాయని వివరించింది.ఈ సమస్యలను పరిష్కరించకపోతే రవాణా పరిశ్రమ మనుగడ సాగించలేదని పేర్కొంది.కానీ దురదృష్టవశాత్తూ ఈ అంశాలు వేటినీ ఆర్థిక మంత్రి కనీసం ప్రస్తావించను కూడా లేదని పేర్కొంది. పైగా అసంఘటిత రంగమైన దీనిలో 90శాతానికి పైగా రోడ్డు రవాణా కార్మికులు వున్నారు. వారి పరిస్థితి దయనీయంగా వుంది. ఏ కార్మిక చట్టాల కిందకు వారు రారు. ఏ సంక్షేమ చర్యలు వుండవు. ఉపాధి హామీ వుండదు. సామాజిక భద్రత వుండదు. వీటిపై వి.వి.గిరి జాతీయ లేబర్ సంస్థ చేసిన సిఫారసులను కూడా పెడచెవిన పెట్టారు. బడ్జెట్లో జాతీయ రహదారుల కేటాయింపులు రెట్టింపు చేశారు, కానీ దానివల్ల రోడ్డు రవాణా రంగం ఏమీ లాభపడదని సమాఖ్య పేర్కొంది. అసంఘటిత రంగ రవాణా కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ, ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సమాఖ్య కోరింది.