Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీ మిగులు విలువ రూ.5 లక్షల కోట్లుగా లెక్కింపు
- దీపమ్ సెక్రటరీ తూహిన్ పాండే ప్రకటన
- వాస్తవాని కంటే తక్కువచేసి చూపే కుట్ర : నిపుణులు
- ప్రయివేటుకు ఎస్సీఐ, బీపీసీఎల్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)ని బలిపశువును చేసే కుట్ర జరుగుతున్నది. విలువను కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్ఐసీ మిగులు విలువ (నికర ఆస్తులు, ప్రస్తుత విలువతో కూడిన భవిష్యత్తులోని లాభాలు కలుపుకుని) రూ.5 లక్షల కోట్ల పైనా ఉంటుందని దీపమ్ సెక్రటరీ తూహిన్ కాంత పాండే తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఈ బీమా సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానున్న నేపథ్యంలో కేంద్రం ఎల్ఐసీ విలువను లెక్కిస్తోంది. బీమా కంపెనీలు ఐపీఓకు వచ్చినప్పుడు వాటి మిగులు లేదా నికర విలువ (ఎంబెడెడ్)ను సెబీకి సమర్పించే ఇష్యూ ప్రతిపాదిత పత్రాల్లో పొందుపర్చాల్సి ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నికరవిలువ అత్యంత కీలకమైంది. దీన్ని బట్టే ప్రభుత్వం ఎంత మొత్తం నిధులను సమీకరించేది ఆధారపడి ఉంటుంది.
''ఎల్ఐసీ ఎంబెడెడ్ విలువ రూ.5 లక్షల కోట్ల పైన ఉండొచ్చు. సంస్థ విలువ దీనికి బహుళ రెట్లలో ఉంటుంది'' అని పాండే తెలిపారు. ఎంబెడెడ్ విలువ కంటే సంస్థ విలువ నాలుగు రెట్లు ఉండొచ్చని మీడియా రిపోర్టులు వస్తున్నాయి. ఎల్ఐసీలో వాటాల అమ్మకం ద్వారా రూ.1 లక్ష కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ముగింపు నాటికి పీఎస్‌యూల్లో రూ.1.75 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులను విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఎల్ఐసీలో డిజిన్వెస్ట్‌మెంట్ చేపడుతుంది. ఎల్ఐసీలోని వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థల్లో మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి వీలుందని పాండే పేర్కొన్నారు.
ఇంత కంటే ఘోరం మరొకటిలేదు : నిపుణులు
ఎల్ఐసీ ఎంబాడెడ్ విలువను చాలా తక్కువగా లెక్కించారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ శక్తులకు చౌకగా వాటాలను అప్పగించే కుట్రలో ఇది జరుగుతుందని విమర్శిస్తున్నారు. ఓ ప్రభుత్వరంగ సంస్థను బలిపశువును చేయడంలో ఇంత కంటే ఘోరం మరొకటిలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థలో వాటాల విక్రయం వద్దని ఓ వైపున దేశ వ్యాప్తంగా పలు వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంటే.. మరోవైపు 25 శాతం వరకు విక్రయిస్తామనడం ఆందోళనకరమని ఆ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చేవారం ముగింపులోపే ఐపీఓ ప్రతిపాదిత దస్త్రాలను సెబీకి సమర్పించే అవకాశం ఉందని పాండే బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం 5 శాతం వాటాలను విక్రయించే అవకాశం ఉందన్నారు. వచ్చే మార్చిలోనే ఐపీఓ ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది ప్రయివేటుకు ఆ సంస్థలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు పీఎస్‌యూలను ప్రయివేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తూహిన్ కాంత్ పాండే తెలిపారు. ఈ జాబితాలో షిప్పింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, బీపీసీఎల్‌లు ఉన్నాయన్నారు. 2022-23లో రూ.65వేల కోట్ల విలువ చేసే పీఎస్‌యూల వాటాలను విక్రయించనున్నామని మోడీ సర్కార్ బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పలు పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల విక్రయానికి పెట్టనున్నట్టు తెలిపారు. పవన్ హాన్స్ కొనుగోలుకు ఇప్పటికే పలు బిడ్లు వచ్చాయన్నారు. తదుపరి ప్రక్రియను చేపట్టనున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈసీజీఎస్, వాప్కోస్, నేషనల్ సీడ్స్ సంస్థలు లిస్టింగ్‌కు రానున్నాయన్నారు.