Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ విమర్శ
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ దేశంలోని గిరిజనుల అవసరాలను అస్సలు పట్టించుకోకుండా ఘోరమైన ద్రోహం చేసిందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్ఎం) విమర్శించింది. బడ్జెట్లో పేర్కొన్నట్లుగా ఇది అమృత కాలం కాదని, గిరిజనులకు విషకాలమని వ్యాఖ్యానించింది. ఆకలి, నిరుద్యోగం, జీవనోసాధులు లేకపోవడం వంటి సమస్యలు గిరిజన కమ్యూనిటీలను వేధిస్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ఈ బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. ఆర్థిక, సామాజిక అసమానతలను పరిష్కరించేందుకు పంపిణీ న్యాయమనే కోణాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు బడ్జెట్ ఉద్దేశించబడుతుందని, కానీ ఈ బడ్జెట్ అసమానతలను మరింత రెచ్చగొట్టే చర్యలు తీసుకుందని ఎఎఆర్ఎం పేర్కొంది. సిగ్గుపడే రీతిలో గిరిజన సంస్థలకు చేసిన కేటాయింపులు, వ్యయం వుందని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వేసిన పాత అంచనాల ప్రకారమే ఎస్టిలకు మొత్తం బడ్జెట్లో 8.6శాతం వ్యయం కేటాయించాలని కానీ తాజా అంచనాల ప్రకారం కేవలం 2.26శాతం కేటాయించారని, ఇది సిగ్గుచేటైన విషయమని విమర్శించింది. పైగా గిరిజనుల సంక్షేమం కోసం కేటాయించామని చెప్పిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని పేర్కొంది. పైగా ఈ ఏడాది ఆహార సబ్సిడీని రూ.80వేల కోట్ల మేరా తగ్గించారని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.25వేల కోట్లు తగ్గించారని విమర్శించింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది రంగాలకు కేటాయింపుల్లో కోత పెట్టడం వల్ల గిరిజనులు తీవ్రంగా ప్రభావితమవుతారని పేర్కొంది.