Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టసభ సభ్యులపై 4984 కేసులు
- పార్లమెంట్లోనూ నేరచరితుల సంఖ్య ఎక్కువే
- వీటి విచారణ వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి : అమీకస్ క్యూరీ
న్యూఢిల్లీ : నేరం ఎవరు చేసినా..అది నేరమే అవుతుంది. కానీ చట్టసభల్లో ప్రవేశిస్తున్న నేరగాళ్లకు బేడీలెందుకు పడటంలేదు..? చదువు,సంస్కారం చూసి నాయకులను చట్టసభలకు పంపేరోజులు గతించాయి. ఇపుడు ఎన్ని దొమ్మిలు, ఎంతమందిని మర్డర్ చేశాడు.. ఇలా ఎన్ని నేరాలు..ఘోరాలకు పాల్పడ్డాడో..పరిశీలించి రాజకీయపార్టీలు అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నాయి. ఇక మోడీ జమానాలో పార్లమెంట్లోకి అడుగుపెట్టిన నేరచరితుల సంఖ్య 25 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. దశాబ్దకాలంగా నేరచరితనేతలపై సీబీఐ,ఈడీ కేసులు పెండింగ్ కేసులే ఎక్కువగా ఉన్నాయంటే నమ్ముతారా..కానీ ఇది నిజం. అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రత్యర్థులను టార్గెట్ చేయటానికి దర్యాప్తుసంస్థల్ని వాడుకుంటున్న విషయం విదితమే. ఇక మనదేశంలో చట్టసభ సభ్యులపై 4984 క్రిమినల్ కేసులున్నాయని సుప్రీంకోర్టు నియమించిన 'అమీకస్ క్యూరీ' తేల్చింది. డిసెంబర్, 2021నాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన ఈ కేసులన్నీ వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో 'అమీకస్ క్యూరీ' తెలిపింది. ఈ కేసుల విచారణ వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక న్యాయస్థానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. గణాంకాలు రూపొందించాలని అమీకస్ క్యూరీని సుప్రీంకోర్టు కోరగా, వేల సంఖ్యలో క్రిమినల్ కేసుల విచారణ పెండింగ్లో ఉందని అమీకస్ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నది. పెండింగ్ కేసుల సంఖ్య డిసెంబర్ 2018లో 4110, అక్టోబర్ 2020లో 4859గా ఉందని తెలిపింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది విజరు హన్సారియా నేతృత్వంలోని 'అమీకస్ క్యూరీ' ఏమందంటే..''సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ..4984 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఐదేండ్లు దాటిన కేసులు 1899 ఉన్నాయి. డిసెంబర్, 2021నాటికి వివిధ హైకోర్టుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ గణాంకాల్ని రూపొందించాం'' అని పేర్కొన్నది.