Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో సీపీఐ(ఎం) నేత ఎలమారం కరీం ప్రయివేటు బిల్లు
న్యూఢిల్లీ : లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జాతీయ కార్యదర్శి, సీపీఐ(ఎం) రాజ్యసభ పక్ష నేత ఎలమారం కరీం డిమాండ్ చేశారు. శుక్రవారం రాజ్యసభలో ఎలమరం కరీం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎలమారం కరీం నోటీసు ఇచ్చారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా ప్రవేశపెట్టిన ప్రయివేట్ మెంబర్ బిల్లు - 'ది యూనిఫాం సివిల్ కోడ్ ఇన్ ఇండియా బిల్లు, 2022'ను వ్యతిరేకిస్తూ ఎలమారం కరీం ఈ నోటీసు ఇచ్చారు. ఆ బిల్లును అనుమతించొద్దని కోరారు.
రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్
నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు కోరుతూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి బిల్లును తిప్పి పంపడంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. తమిళనాడు గవర్నర్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ(ఎం), సీపీఐ, టీఎంసీ, ఆర్జేడీ, ఐయూఎంఎల్ తదితర ప్రతిపక్షాలు శుక్రవారం సభను వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ మాట్లాడుతూ సీఎం రెండు సార్లు గవర్నర్ను కలిశారనీ. అయినా ఆయన చలించలేదని విమర్శించారు. ''తమిళనాడు సీఎం గవర్నర్ను రెండుసార్లు కలిశారు. నీట్ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. కానీ అలా చేయలేదు. అతను ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. మేం దీనిని రాజ్యసభలో లేవనెత్తాలనుకున్నాం. కానీ అనుమతించ లేదు. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం'' అని అన్నారు.