Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభల నేపథ్యంలో రాజకీయ ముసాయిదాను ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు తదితరులు శుక్రవారం విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు... సీపీఐ(ఎం) 22వ మహాసభ తరువాత కాలంలో ఫాసిస్టు ఆరెస్సెస్ హిందూత్వ ఎజెండాను అధికారంలో ఉన్న బీజేపీ దూకుడుగా ముందుకు తెస్తూ మరింత పటిష్టవంతమవుతుండడం చూస్తున్నాం. నయా ఉదారవాద సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా మతతత్వ-కార్పొరేట్ శక్తుల అపవిత్ర పొత్తును పటిష్టపరచుకుంటూ, జాతీయ ఆస్తులను కొల్లగొట్టడం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించడం, రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడం, పూర్తి స్థాయి నిరంకుశత్వాన్ని రుద్దడం ద్వారా అది పెద్దయెత్తున బహుమఖ దాడిని సాగిస్తున్నది. 2019 ఎన్నికల తరువాత మతపరమైన జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఎక్కువ సీట్లు, అధిక శాతం ఓట్లతో బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి మత సమీకరణ దూకుడు పెంచింది. మన లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగ పునాదులను దెబ్బతీస్తూ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేయడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35ఎ అధికరణలను రద్దు చేయడం, రాజ్యాంగ వ్యతిరేక పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), అయోధ్యలో ఆలయ నిర్మాణం ప్రారంభించడం వంటివి చేపట్టింది. క్రూరమైన నిర్బంధ చట్టాలను దుర్వినియోగపరచడం ద్వారా ప్రజల ప్రజాతంత్ర హక్కులు, పౌర హక్కులపై నిర్దాక్షిణ్యంగా దాడులకు తెగబడుతూ, భారత రాజ్యాంగ గణతంత్ర స్వరూపానికి తూట్లు పొడిచేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నది. ఈ కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలకు అంతకంతకూ పెరుగుతున్న ప్రతిఘటనను కూడా చూస్తున్నాం. కొత్త లేబర్ కోడ్లు, ప్రైవేటీకరణ యత్నాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సాధారణ, రంగాలవారీ సమ్మెల ద్వారా నిరసన వ్యక్తం చేసింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమం రాజ్యాంగం, పౌరసత్వ అణచివేత వ్యతిరేక సామూహిక నిరసనగా రూపుదిద్దుకుంది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన అతి పెద్ద, అత్యంత సుదీర్ఘ పోరాటం చారిత్రాత్మక విజయంతో ముగిసింది.ఈ పోరాట ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసుకుంది.
ఈ నాలుగు సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం అమెరికా వ్యూహాత్మక, రాజకీయ, భద్రతా పన్నాగాలకు పూర్తిగా లొంగిపోయింది. అమెరికా సామ్రాజ్యవాదానికి భారత్‌ను అత్యంత నమ్మకమైన బంటుగా మార్చింది. ఇది మన ఇరుగు పొరుగుదేశాలతో సంబంధాలపైన, భారత్ అంతర్జాతీయ స్థితిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచంలో ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో నేటి భారతీయ పరిస్థితిపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.
రాజకీయ పంథా
- దాదాపు ఎనిమిదేండ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో మతతత్వ కార్పొరేట్ శక్తుల పొత్తును పటిష్టపరుస్తూ పెద్దయెత్తున నిరంకుశ దాడులకు పాల్పడుతుండడాన్ని చూస్తున్నాం. 2019లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫాసిస్టు ఆరెస్సెస్ హిందూత్వరాష్ట్ర ఎజెండాను దూకుడుగా ముందుకు తెస్తున్నది. దీంతోబాటు నయా ఉదారవాద విధానాలు, పెరుగుతున్న నిరంకుశ పాలనను అంతే దూకుడుతో ముందుకు తీసుకెళ్తున్నది. ఆరెస్సెస్ ముందుకు తెస్తున్న హిందూత్వ రాష్ట్ర ఎజెండా రాజ్యాంగ చట్రాన్ని హానికరమైన రీతిలో దెబ్బతీస్తోంది. అలాగే భారత రిపబ్లిక్ లౌకిక, ప్రజాస్వామ్య స్వరూపాన్ని నాశనం చేస్తోంది.
- ఈ రీత్యా బీజేపీని ఏకాకిని చేసి, ఓడిండచమే మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. దీనిని సాధించేందుకు శక్తివంతమైన, సమరశీలమైన ప్రజా, వర్గ పోరాటాల్లోకి ప్రజలను పెద్దయెత్తున సమీకరించడానికి సీపీఐ(ఎం), వామపక్ష శక్తుల స్వతంత్ర బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
- హిందూత్వ ఎజెండా, మతతత్వ శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా సాగే పోరాటానికి నాయకత్వం వహించడానికి పార్టీని, వామపక్ష శక్తులను బలోపేతం చేయాలి.హిందూత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని లౌకిక శక్తులను విస్తృతంగా సమీకరించేందుకు కృషి చేయాలి.
- నయా ఉదారవాద విధానాల దూకుడుకు వ్యతిరేకంగా ప్రజలను పెద్దయెత్తున సమీకరించేందుకు పార్టీ ముందు పీఠిన నిలవాలి. మన జాతీయ ఆస్తుల లూటీ, ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సదుపాయాలను, ఖనిజ వనరులను పెద్దయెత్తున ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా ప్రజా, వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి. రైతుల పోరాటం మాదిరిగానే ఈ కార్పొరేట్- మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేందుకు, లౌకిక శక్తులన్నిటినీ ఏకతాటిపై నిలపడం ద్వారానే ఈ లక్ష్యాన్ని పూర్తి చేయగలం.
- హిందూత్వ కార్పొరేట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం విజయవంతం కావాలంటే హిందూత్వ, మత తశ్వ శక్తులకు వ్యతిరేకంగా , నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఏక కాలంలో పోరాటాలు సాగించాల్సిన అవసరముంది.
- ఏకీభావం ఉన్న అంశాలపై పార్లమెంటులో లౌకిక ప్రతిపక్షాలకు పార్టీ సహకరిస్తుంది. మతతత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పార్లమెంటు వెలుపల విశాల ప్రాతిపదికపై అన్ని లౌకిక శక్తులను సమీకరించేందుకు పార్టీ కృషి చేస్తుంది. పార్టీ, వామపక్షాలు స్వతంత్రంగా, అంశాల ప్రాతిపదిక ఇతర ప్రజాతంత్ర శక్తులతో ఐక్యంగా పోరాడతాయి. నయా ఉదారవాద విధానాల దాడులు, నిరంకుశ దాడులు, ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కులపై దాడులు, క్రూర చట్టాలను ఉపయోగించి అసమ్మతిని అణచివేసే యత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలి.
- వర్గ, ప్రజా సంఘాలతో కూడిన ఐక్య వేదికలకు పార్టీ మద్దతు ఇస్తుంది. కార్మిక, కర్షక-వ్యవసాయ కార్మికుల ఐక్య కార్యాచరణను బలోపేతం చేసే అన్ని చర్యలకు పార్టీ మద్దతు ఉంటుంది.
- వామపక్ష ఐక్యతను బలోపేతం చేయడంతో బాటు పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలి. పెట్టుబడిదారీ, భూస్వామ్య పాలకవర్గాల విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను ఈ పోరాటాలు ముందుకు తేవాలి.
- ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమాలతో సహా అన్ని వామపక్ష, లౌకిక శక్తులను కూడగట్టేందుకు పార్టీ నికరంగా కృషి సాగించాలి. వామపక్ష, ప్రజాతంత్ర కార్యక్రమాన్ని ప్రత్యామ్నాయ విధానాల రూపంలో హైలైట్ చేసేలా వామపక్ష ప్రజాతంత్ర వేదిక ఉమ్మడి పోరాటాలు నిర్వహించాలి.
- ఎన్నికలు ఆసన్నమైనప్పుడు బిజెపి వ్యతిరేక ఓట్లను సాధ్యమైనంత ఎక్కువగా కూడగట్టేందుకు పైన పేర్కొన్న రాజకీయ పంథాకు అనుగుణంగా తగిన ఎన్నికల ఎత్తుగడలను రూపొందించుకోవడం జరుగుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కర్తవ్యాలు
- పార్టీ తన స్వతంత్ర పాత్రను బలోపేతం గావించేందుకు తన ప్రభావాన్ని , రాజకీయ జోక్య సామర్ధ్యాలను పెంచుకోవాలంటే నిరంతర వర్గ , ప్రజా పోరాటాలే మార్గం. ప్రజల సమస్యలపై స్థానిక పోరాటాలు, సరైన ఫాలోఆప్ ఉండేలా చూసేందుకు పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
- నయా ఉదారవాద విధానాల వల్ల తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్న అన్ని తరగతుల ప్రజానీకాన్ని జీవనోపాధి సమస్యలపై పోరాటాల్లో సమీకరించి, ఐక్యం చేయడంపై పార్టీ దృష్టి సారించాలి. అన్ని సద్యోజనిత (స్పాంటేనియస్) ఉద్యమాల్లోను పార్టీ చురుగ్గా పాల్గొని, వాటిని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి.
- హిందూత్వ మతతత్వానికి వ్యతిరేకంగా సాగే పోరాటాల్లో పార్టీ ముందుపీఠిన నిలవాలి. ఈ పోరాటం బహుముఖ స్థాయిల్లో, సుస్థిర పద్ధతుల్లో నిర్వహించాలి. హిందూత్వ శక్తుల కార్యకలాపాలను తిప్పికొట్టేందుకు పౌర హక్కుల కార్యకర్తలు, సంస్థలు, సామాజిక ఉద్యమాలతో సహా లౌకిక, ప్రజాతంత్ర శక్తుల మధ్య సాధ్యమైనంత విశాల ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేయాలి.
- మానవ హక్కులు, ప్రజాతంత్ర హక్కులు, పౌర స్వేచ్ఛ, కళాత్మక స్వేచ్ఛ, అకడమిక్ స్వయంప్రతిపత్తి పరిరక్షణకు, అలాగే హిందూత్వ మతతత్వం, రాజ్యాంగంలోని లౌకిక, ప్రజాతంత్ర విలువలను దెబ్బతీసే చర్యలకు వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టడంలో పార్టీ ముందుండాలి.
- సామాజిక న్యాయం కోసం పోరాటాలను ముదుకు తీసుకెళ్లే యత్నాలను పార్టీ బలోపేతం చేయాలి. మహిళలు, దళితులు, ఆదివాసీలు, ఇతర అణగారిన వర్గాలపై సామాజిక అణచితేకు సంబంధించిన అంశాలపై పోరాడడంలో పార్టీ ఛాంపియన్‌గా ఉండాలి.
- హిందూత్వ మతోన్మాద దూకుడు దాడులకు వ్యతిరేకంగా మైనార్టీల హక్కులు, భద్రత పరిరక్షణకు సాగే కృషిని పటిష్టపరచాలి.
- పెరిగిపోతున్న మూఢ విశ్వాసాలు, అస్పష్టత, నిర్హేతుకత, గుడ్డిగా విశ్వసించడం వంటి వాటికి వ్యతిరేకంగా సామాజిక, సైద్ధాంతిక పరోఆటాలను పార్టీ బలోపేతం చేయాలి. అహేతుకతకు, అసమంజసతకు వ్యతిరేకంగా ప్రజల్లో హేతువాద దృక్పథాన్ని, శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేందుకు బహిరంగ చర్చను బలోపేతం చేయడంలో పార్టీ అగ్రభాగాన ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలోను, బూజుపట్టిన భావాల పునరుద్ధరణకు వ్యతిరేకంగా పోరాడడంలో ముందుండాలి.
- మన జాతీయ ఆర్థిక సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో భారత ప్రజల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక చైతనాన్ని రగిలించేందుకు పార్టీ కృషి చేయాలి. పెట్టుబడిదారీ విధానానికి ఏకైక ప్రత్యేమ్నాయం సోషలిజమేనన్న ప్రచారాన్ని పటిష్టంగా నిర్వహించాలి.
- అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వ లొంగుబాటు వైఖరికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. భారత దేశ స్వతంత్ర విదేశాంగ విధానం పునరుద్ధరణ కోసం పోరాటాలు చేపట్టాలి.
- కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి దన్నుగా పార్టీ నిలవాలి. అలాగే పార్టీపై ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో జరుగుతున్న ఫాసిస్ట్ తరహా దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి.
ముగింపు
దేశ వ్యాపితంగా బలమైన కమ్యూనిస్టు పార్టీని నిర్మించేందుకు ఈ కర్తవ్యాలను పూర్తి చేయాల్సిన అవసరముంది. నిర్మాణ అంశాలపై కొల్కతా ప్లీనం తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయడం ద్వారానే మార్క్సిజం లెనినిజం ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రజా పునాదితో బలమైన పార్టీని నిర్మించగల. ఇందుకు తప్పనిసరిగా కేంద్రీకరించాల్సిన అంశాలు:
- ప్రజలతో మమేకం అయ్యేందుకు ఉద్దేశించిన పజాపంథాను అమలు చేయడం ద్వారానే విప్లవ పార్టీని బలోపేతం చేయగలం.
- ప్రజల్లో పార్టీ పరిధిని ప్రభావాన్ని విస్తృతంగా తీసుకెళ్లి, వామపక్ష , ప్రజాతంత్ర శక్తులను కూడగట్టాలి.
- కోల్‌కతా ప్లీనం నిర్దేశించిన విధంగా నాణ్యమైన సభ్యత్వంతో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం గావించాలి.
- యువతతో పాటు మహిళలను పార్టీ వైపు ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- పరాయికరణకు సంబంధించిన అన్ని రకాల భావజాలాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటాలను బలోపేతం చేయాలి.
- బలమైన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి మన రెట్టించిన పట్టుదలతో కృషి చేద్దాం.
- ప్రజా పంథాతో విప్లవ పార్టీ నిర్మాణం దిశగా ముందుకు సాగుదాం!
- దేశ వ్యాపితంగా ప్రజా పునాది కలిగిన బలమైన సీపీఐ(ఎం)ను నిర్మించే దిశగా ముందుకు సాగుదాం!