Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో పలు తీవ్రమైన మార్పులు చేయాలని పునర్విభజన కమిషన్ తన ముసాయిదా నివేదికలో ప్రతిపాదించింది. దీనిపై సూచనలు ఇచ్చే నిమిత్తం ఈ నివేదికను జమ్ము కాశ్మీర్‌కే చెందిన ఐదుగురు అసోసియేట్ సభ్యులకు అందజేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. జమ్ము ప్రాంతం నుంచి రాజౌరి, పూంచ్‌లను కలుపుకోవడం ద్వారా అనంత్‌నాగ్ పార్లమెంటరీ సీటును విస్తృతపరచాలని ఈ నివేదికలో ప్రతిపాదించారు. కాశ్మీర్ డివిజన్లో భారీ మార్పులు తీసుకురావాలని కూడా పేర్కొన్నారని వారు తెలిపారు. పూర్వపు జమ్ము కాశ్మీర్‌లోని పలు అసెంబ్లీ సీట్లు అదృశ్యమయ్యాయి. వాటిలో వలస వచ్చిన కాశ్మీరీ పండిట్లకు పెట్టని కోటగా వున్న హబ్బా కదల్ సీటు కూడా వుంది. శ్రీనగర్ జిల్లా కన్యార్, సోన్వార్, హజరత్బల్ అసెంబ్లీ సీట్లు మినహా మిగిలిన అన్ని సీట్లను తిరిగి రూపొందించి, కొత్తగా రూపొందించిన చన్నాపొరా, శ్రీనగర్ సౌత్ వంటి కొత్త అసెంబ్లీ సీట్లతో విలీనం చేసినట్లు అధికారులు తెలిపారు. హబ్బా కదల్కు చెందిన ఓటర్లు ఇకపై మూడు అసెంబ్లీ సీట్లలో భాగమవుతారని ప్రతిపాదిత నివేదిక పేర్కొంటోంది. ఐదు అసెంబ్లీ సీట్లు కలిగిన బద్గామ్ జిల్లాను కూడా పునర్నిర్వచించారు. కొన్ని ప్రాంతాలను విడగొట్టి ఉత్తర కాశ్మీర్‌లోని కుంజర్ వంటి కొత్త అసెంబ్లీ సీట్లను రూపొందించి బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంతో విలీనంచేశారు. ఉత్తర కాశ్మీర్‌లోని సంగ్రామ సీటును ఇతర అసెంబ్లీ సీట్లతో విలీనం చేశారు. అనంత్‌నాగ్ లోక్‌సభ సీటులో భాగంగా వున్న పుల్వామా, త్రాల్, షోపియన్‌లో కొన్ని ప్రాంతలు ఇకపై శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగం కానున్నాయి. ఐదుగురు అసోసియేట్ సభ్యులైన ఫరూక్ అబ్దుల్లా, హస్నైన్ మసూది, అక్బర్ లోనె (నేషనల్ కాన్ఫరెన్స్‌కి చెందిన లోక్‌సభ ఎంపీలు), జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ (బిజెపి ఎంపిలు)లకు శుక్రవారం ఈ నివేదికను అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14కల్లా దీనిపై వారి అభిప్రాయాలను తెలియజేయాల్సిందగా కోరారు. ఆ తర్వాత ఈ నివేదికను పబ్లిక్ డొమైన్లో వుంచుతారు. కాశ్మీర్ డివిజన్లో ఒకటి, జమ్ము ప్రాంతంలో ఆరు అసెంబ్లీ సీట్లు పెంచాలని చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ గతేడాది డిసెంబరు 31న నేషనల్ కాన్ఫరెన్స్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఈ నివేదిక పట్టించుకోలేదు. 2020 మార్చి 6వ తేదీన సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశారు, చీఫ్ ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కె.కె.శర్మలతో కూడిన కమిషన్ ఏర్పడింది. తర్వాత 2021 మార్చి 6న మరో ఏడాది పొడిగించారు. అది వచ్చే నెలతో ముగియనుంది.