Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిశా రాష్ట్రంలో ఘటనఇది పిరికిపంద చర్య : భద్రాద్రి ఎస్పీ
నవతెలంగాణ-చర్ల
ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా కర్లార్ఖుంట వంతెనపై మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఓ జర్నలిస్ట్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహనగిరి గ్రామానికి చెందిన జర్నలిస్టు రోహిత్ బిస్వాల్ స్థానిక భాషా దినపత్రిక ధరిత్రి కరస్పాండెంట్‌గా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని స్థానిక ప్రజలను కోరుతూ మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. ఈ వార్తలను కవర్ చేయడానికి రోహిత్ స్పాట్‌కు వెళ్లినట్టు తెలుస్తున్నది. కవర్ చేస్తుండగా ఒక్కసారిగా మందుపాతర పేలడంతో అక్కడికక్కడే ఆయన మృతిచెందాడు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని భద్రతా బలగాలు, బాంబు డిఫ్యూజింగ్ టీమ్ చుట్టుముట్టింది. సీఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త బృందం కూడా దర్యాప్తు ప్రారంభించిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.
మావోల దాడులు పిరికిపంద చర్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్
నిషేధిత మావోయిస్టు పార్టీ జర్నలిస్టులు, ఆదివాసీలపై చేస్తున్న దాడులు, బెదిరింపులను పిరికిపంద చర్యలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టు పార్టీ కరపత్రాల కింద దాచిన ఐఈడీ పేలుడులో కష్టపడి పనిచేసే జర్నలిస్ట్ ఒడిశాలో మరణించాడని తెలిసిందన్నారు. గతేడాది చర్లలోనూ ఇటువంటి ఘటనలో ఓ పేద ఆదివాసీ గాయపడ్డాడని, మావోయిస్టు పార్టీ ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. గిరిజన మారుమూల ప్రాంతంలో అభివృద్ధి పనులు, పాఠశాలలు, రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణాలను మావోయిస్టు పార్టీ అనుమతించదన్నారు. విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ పెరిగితే మావోయిస్టు పార్టీ, దాని దోపిడీ నాయకులపై ఆదివాసీలు తిరుగుబాటు చేస్తారని మావోయిస్టులు భయపడుతున్నారని పేర్కొన్నారు. సాయుధ బృందాలను తరిమికొట్టాలని ఆదివాసీలందరికీ విజ్ఞప్తి చేశారు.