Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూజీసీ చైర్మన్‌గా జగదీశ్ కుమార్ నియామకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు ఎస్ఎఫ్ఐ పిలుపు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్ కాషాయీకరణను ప్రతిఘటించాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మెన్‌గా విద్యార్థి వ్యతిరేక జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చింది. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్ బిస్వాస్ ప్రకటన విడుదల చేశారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) చైర్మన్ పదవికి జేఎన్‌యూ వైస్ ఛాన్స్‌లర్‌ను ఇటీవల నియమించడం అనేది ప్రస్తుత ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో నయా ఉదారవాద విధానాలను మరింత పెంచడానికి ఒక అడుగు ముందుకేసినట్లని విమర్శించారు.''గత ఆరేండ్ల అనుభవం నుంచి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ విద్యార్థి, ఉపాధ్యాయులు, సిబ్బందికి వ్యతిరేకంగా
నిర్ణయాలు తీసుకోవడంలో పేరుగాంచారు. అకడమిక్ కౌన్సిల్‌తో సహా ప్రజాస్వామ్య నిర్ణయ ప్రక్రియను నిర్వీర్యం చేయడం నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ల వరకు ఫీజుల పెంపు, ప్రయివేటీకరణ వంటి ఎజెండాలను ముందుకు తీసుకురావడం వరకు అందరికీ తెలుసు. దీనికే పరిమితం కాకుండా నియామక ప్రక్రియను ఉల్లంఘించడం, జీఎస్ క్యాస్ వంటి సంస్థలను విచ్ఛిన్నం చేయడంలో జగదీష్ కుమార్ అపఖ్యాతి పాలయ్యారు. అతని హయాంలో జేఎన్‌యూ ఎంఫిల్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో గరిష్ట సంఖ్యలో సీట్లను తగ్గించారు. జేఎన్‌యూ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించడం, ప్రగతిశీల అడ్మిషన్ విధానం నమూనాను మార్చడం, జేఎన్‌యూ అడ్మిషన్ ప్రక్రియలో రిజర్వేషన్ విధానాన్ని నిరంతరం ఉల్లంఘించడాన్ని కూడా చూశాం'' అని తెలిపారు. ''స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఇలాంటి విద్యార్థి వ్యతిరేక విధానాలన్నింటినీ తీవ్రంగా వ్యతిరేకించింది. పోరాడింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ పదవికి జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్‌ను నియమించడాన్ని నిరసిస్తూ ఆందోళనలకు ఎస్ఎఫ్ఐ తన అన్ని యూనిట్లకు పిలుపునిచ్చింది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి విధానాలను ఐక్యంగా వ్యతిరేకిస్తాం'' అని స్పష్టం చేశారు.