Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాల్సిందే
- సాంకేతిక కారణాలతో తిరస్కరించొద్దు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : కోవిడ్ మరణాల సంఖ్యపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేదాంట్లో నిజం ఉండటం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాల్సిందేనని కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. దరఖాస్తులన్నీ మోసపూరితమని ఒకేగాటన కట్టి తిరస్కరించటం, అలా చెప్పటం బాధాకరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందజేసే అంశంపై జస్టిస్ ఎం.ఆర్.షా, బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. సాంకేతిక కారణాలు అడ్డుచూపుతూ బాధితుల దరఖాస్తులను తిరస్కరించవద్దని, దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. దరఖాస్తులను 10రోజుల్లోగా పరిష్కరించాలని చెప్పింది. ''కోవిడ్ మరణాలపై పూర్తి వివరాలు అందజేయాలని ఇంతకు ముందటి ఆదేశాల్లోనే సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది. అయినప్పటికీ ఆయా రాష్ట్రాలు తమ తమ పోర్టల్స్‌లో పూర్తి వివరాలు విడుదల చేయలేదు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో తిరస్కరించడానికి వీల్లేదు. నష్టపరిహారం అందజేయటం..సేవా కార్యక్రమం కాదు. ప్రభుత్వాల బాధ్యత ఇది. అక్కడికి వెళ్లండి..ఇక్కడికి వెళ్లండి..అంటూ దరఖాస్తుదారుల్ని తిప్పొద్దు. మనసుతో పనిచేయండి''అని ధర్మాసనం తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది. నోడల్ అధికారిని నియమించాలని, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటి (ఎస్ఎల్ఎస్ఏ) కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఇంతకు ముందు ఆదేశాల్లో సుప్రీం పేర్కొన్నది. కోవిడ్‌తో మరణించిన వారి పేర్లు, పూర్తి చిరునామా, మరణ ధ్రువీకరణ పత్రం ఎస్ఎల్ఎస్ఏకు అందజేయాలని తెలిపింది.