Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎంఎంల్‌ఏ వివాదాస్పద వ్యాఖ్యలు
- 8న హైకోర్టు విచారణ
ఉడుపి : ఇప్పటివరకు కొన్ని జిల్లాలకే పరిమితమైన హిజాబ్ వివాదం కర్నాటకలోని అన్ని జిల్లాలకూ విస్తరిస్తున్నాయి. ముస్లిం విద్యార్థినులకు చదువును దూరంచేసే కుట్రతోపాటు రాజకీయంగా లబ్ధిపొందేందుకు దీన్ని వినియోగించుకునేలా కాషాయమూకలు ఎత్తులువేస్తున్నాయి. ముసుగు ధరించి కాలేజీలకు వస్తే అనుమతించేది లేదంటూ ఉడిపి జిల్లాలోని పీయూ కళాశాల విద్యార్థినులకు కాలేజీ యాజమాన్యం చెప్పడంతో తొలుత వివాదం రగిలింది. ఉడిపి తీరప్రాంత పట్టణమైన కుందాపూర్‌లోని భండార్కర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఢిగ్రీ కళాశాల గేటు వద్ద హిజాబ్ తీయకపోతే అనుమతించబోమని అధికారులు చెప్పారు. దీంతో, 40 మంది విద్యార్థినులు గురు, శుక్రవారాలు హిజాబ్ ధరించి నిరసన తెలిపారు. ఇలా పలుచోట్ల ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ముస్లిం విద్యార్థినులు దీన్ని ప్రశ్నిస్తుండగా, తాజాగా హిజాబ్ ధరించడాన్ని సవాలు చేస్తూ కాషాయ మూకల ప్రోత్సాహంతో కొంతమంది విద్యార్థినులు కాషాయ స్కార్ఫ్‌లు ధరించి కాలేజీలకు వస్తున్నారు. కాలేజీ యూనిఫారాలపై కాషాయ స్కార్ఫ్ ధరించి 'జై శ్రీరామ్' అని నినాదాలు చేస్తుండగా పోలీసులు చెదరగొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. మత సాంప్రదాయాలను పాటించడానికి విద్యా సంస్థలు వేదికగా మారరాదంటూ కర్నాటక రాష్ట్ర హోం మంత్రి ఇటీవల వ్యాఖ్యానించారు. కలిసి మెలిసి చదువుకోవడమే లక్ష్యంగా విద్యా సంస్థలు వుండాలన్నారు. గణపతి పూజ, సరస్వతి పూజ వంటి వాటిని కాలేజీల్లో అనుమతిస్తున్నప్పుడు ముస్లిం యువతులు తమ ముఖాన్ని కప్పివుంచే హిజాబ్ ధరించి కాలేజీకి వస్తే తప్పేమిటని కాంగ్రెస్ ప్రతినిధులు ప్రశ్నించారు. బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తున్నామంటూ చెప్పుకునే మోడీ సర్కార్ మాటల్లోని బూటకం దీంతో అర్థమవుతోందని అన్నారు.
కాగా, ఈ వివాదంపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనున్నది. బయటకు వచ్చినప్పుడు ముస్లిం యువతులు ముఖానికి ముసుగు ధరించడం వారి హక్కని గుల్బర్గా ఎంఎల్ఎ ఫాతిమా పేర్కొన్నారు. ఇదేమీ కొత్తగా వచ్చిన అలవాటు కాదని అన్నారు. దీనిపై బీజేపీ ఎంఎల్ఎ బసవరాజ్ పాటిల్ యత్నాల్ మరికొంచెం దూకుడుగా వ్యవహరించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'హిజాబ్‌ను కచ్చితంగా ధరించాలని కోరుకునే యువతులు కావాలంటే పాకిస్తాన్‌కు వెళ్లాలని' అన్నారు. కర్నాటకను మరో తాలిబన్‌గా మార్చేందుకు అనుమతించబోమంటూ బీజేపీ ఎంఎల్ఎలు చాలామంది నినాదాలు చేశారు.
దేశ పుత్రికల భవిష్యత్తును దోచుకుంటున్నారు : రాహుల్‌గాంధీ
'విద్యార్థినుల హిజాబ్‌ను వారి చదువుకు అడ్డంకిగా మార్చి దేశ కుమార్తెల భవిష్యత్తును దోచుకుంటున్నాం. మా సరస్వతి అందరికీ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆమె భేదం చూపదు' అని తాజా పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని హితవు పలికారు. బీజేపీనే కొత్త వివాదాన్ని లేవదీస్తోందని, గతంలో ఎవరూ ఇలా ప్రశ్నించలేదని అన్నారు. ఉడిపి జిల్లాలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను ఓ ప్రభుత్వ కాలేజీలోకి అనుమతించకపోవడంపై ఆయన స్పందించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా వాడుకోవద్దు : కుమారస్వామి
మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి దీనిపై స్పందిస్తూ, విద్యా సంస్థల్లో తలెత్తిన ఈ వివాదాన్ని సత్వరమే ముగించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా ఉపయోగించుకోవద్దంటూ బీజేపీ, కాంగ్రెస్‌లకు హితవు చెప్పారు.