Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల అలసత్వం, నిర్లక్ష్యమే కారణమంటున్న అభ్యర్థులు
- కోర్టు విచారణల్లో వేలాది అభ్యర్థుల భవితవ్యం
- పార్టీలకు పట్టని వైనం
పాటియాలా : పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన మదన్‌పాల్ సింగ్ ఉద్యోగం కోసం అన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి చివరకు కానిస్టేబుల్ పోస్ట్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. క్వాలిఫయింగ్ పరీక్షలో పాసయ్యాడు, కానీ ఫిజికల్ టెస్ట్‌కు వెళ్లలేదు. పీహెచ్డీ స్కాలర్ని అయి వుండి ఈ ఉద్యోగం కోసం వెళ్లాలా అని మదనపడి ఆగిపోయాడు. చివరకు నిరుద్యోగిగా మిగిలాడు. ఎలిమెంటరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలా మూడు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఏ ఒక్కటీ రాలేదు. మదన్‌పాల్ అనుభవం చూస్తే పంజాబ్‌లో నిరుద్యోగం ఏ స్థాయిలో వుందో తెలుస్తోంది. సంగ్రూర్‌లోని దళిత కుటుంబానికి చెందిన మదన్‌పాల్ నిర్మాణరంగ కూలీగా పనిచేస్తూ, ప్రతి రూపాయి కూడబెట్టుకుంటూ చదువుకున్నాడు. ఆయన అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకు అర్హత వున్నా ఉద్యోగాలు లేవు.
అపాయింట్మెంట్ల సమయంలో ఆగిపోయి, కోర్టుల్లో కేసు విచారణల కోసం ఎదురుచూస్తూ వుండిపోవడం ఎక్కువవుతుండడం వల్లే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులై వున్నవారిలో కూడా నిరుద్యోగం పెరుగుతోంది. అవినీతి విశృంఖలంగా పెరిగిపోవడం, అసమర్ధులైన అధికార యంత్రాంగం వంటి కారణాల వల్లే ప్రభుత్వ రంగంలో ఉపాధి సంక్షోభం నెలకొందని భావిస్తున్నారు. సాంకేతిక పొరపాట్లు లేకుండా నిష్పాక్షికంగా రిక్రూట్మెంట్కు హామీ కల్పించేలా ఒక్క ముసాయిదా నోటిఫికేషన్ కూడా అధికారుల జారీ చేయడం లేదు. పంజాబ్‌లో ప్రస్తుతం లక్షా 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. విద్యా శాఖలో అధికంగా 19,300 ఖాళీలు వున్నాయి. ఆ తర్వాత పోలీసు, ఆరోగ్య శాఖల్లో వున్నాయి. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో 1158 పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్కి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి విధించిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. దాంతో అభ్యర్థులు కోర్టుకెళ్లారు. దీనిపై ఈ నెల 17న విచారణ జరగాల్సి వుంది.
మహిళలకు రిజర్వేషన్ నిబంధనల అమల్లో యూనివర్సిటీల పక్షపాత వైఖరిని కూడా ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. ఎస్పీలకు 25శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 12శాతం, మహిళలకు 33శాతం రిజర్వేషన్ తప్పనిసరని ప్రభుత్వ రిజర్వేషన్ విధానం పేర్కొంటోంది. ఎస్పీ, ఎస్టీలకు చెందిన మహిళలైతే వారికి మహిళల రిజర్వేషన్ ప్రయోజనాలే అందజేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని పంజాబ్ హర్యానా హైకోర్టులో సవాలు చేశారు.
పరిస్థితులు ఇలా వున్నా రాజకీయ పార్టీల ఎజెండాలో నిరుద్యోగం గురించి ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవడంతో పశ్చిమ దేశాలకు చట్టబద్ధంగా, అక్రమంగా వలసలు వెళుతున్నారని సింగ్ పేర్కొన్నారు. డబ్బు, భూమి, అన్ని వనరులు వున్నవారు ఇతర దేశాలకు వలస వెళుతుంటారు, కానీ మాలాగా ఏ ఆధారం లేనివారు నిరుద్యోగులుగా మిగిలిపోతారని సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో వుంది. పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలివెళ్లిపోతున్నాయి. సున్నితమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 22లక్షల లమంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మేం జరుపుతున్న పోరాటం గురించి ప్రభుత్వానికి పట్టదని అన్నారు. రాష్ట్రంలో 10నుండి 15రోజుల కన్నా పని దొరకడం లేదని రోజువారీ కూలీలు వాపోతున్నారు. పని వెతుక్కుంటూ పొరుగునున్న గ్రామ సర్పంచ్ ఇక్కడకు వచ్చారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా వుందో అర్థమవుతోంది.