Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చురుగ్గా కోటి సంతకాల సేకరణ
విశాఖ : విశాఖ ఉక్కు ఉద్యమానికి ప్రజా మద్దతు పెరుగుతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ చురుగ్గా సాగుతోంది. ఆదివారం కృష్ణా, విశాఖ, పశ్చిమగోదావరి, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో సంతకాలు సేకరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రజాసంఘాల ఆధ్వర్యాన చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ మాట్లాడుతూ పోరాటాలతోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అడ్డుకోగలమన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, టిడిపి బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ సంతకాలు చేసి ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపారు. విజయవాడ కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో వాకర్స్ సంతకాలు చేసి ఉక్కు ఉద్యమానికి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ... విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా రాజీలేని పోరాటాలు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి పార్లమెంట్ సమావేశాల్లో సమర్పిస్తామన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు చూస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. రైతుల పోరాటంతో వ్యవసాయ నల్లచట్టాలపై వెనక్కి తగ్గిన ప్రధాని మోడీ, విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలోనూ తలొగ్గక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమకృష్ణా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు తూర్పు సిటీ కార్యదర్శి వి.గురుమూర్తి, కోరాడ రమణ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో, విశాఖ జిల్లా అక్కయ్యపాలెం, నరసింహనగర్ రైతుబజార్ వద్ద, నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యాన, పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో సిపిఎం ఆధ్వర్యాన, విశాఖ జివిఎంసి 76వ వార్డు పరిధి రిక్షాకాలనీ, రామచంద్రనగర్, ఎస్టి కాలనీ, స్వతంత్రనగర్‌లో, 75వ వార్డు పెద్దకోరాడ రైతుబజార్లో అఖిలపక్షం ఆధ్వర్యాన, విజయనగరం జిల్లా బొబ్బిలిలో సంతకాలు సేకరించారు.