Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన రాహుల్‌గాంధీ
- క్రియాశీల రాజకీయాలకు సునీల్ జాఖర్ గుడ్ బై
ఢిల్లీ : ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీనే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. లూథియానాలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే, పంజాబ్ సీఎం పదవి కోసం ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతోపాటు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవిఆర్) ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్ అధిష్టానం చన్నీ వైపు మొగ్గుచూపింది. ఇటీవల సీఎం మేనల్లుడు ఈడీకి చిక్కడంతో నిజాయితీపరుడిని సీఎంగా ప్రజలు కోరుకుంటున్నారంటూ సిద్ధూ ట్వీట్ చేసి హీటుపెంచారు. ఎవరిని సీఎంగా ప్రకటించినా, కలిసి కట్టుగా పనిచేస్తామంటూ ఇటీవల చన్నీ, సిద్ధూ అధిష్టానానికి తెలిపారు. సీఎం అభ్యర్థిని రాహుల్ ప్రకటించే కొన్ని గంటల ముందు కూడా సిద్ధూ 'రాహుల్ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం' అంటూ పలు ట్వీట్లు చేశారు.
క్రియాశీల రాజకీయాలకు సునీల్ జాఖర్ గుడ్‌బై
రాహుల్ గాంధీ పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి కొద్ది గంటల ముందు ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. 'పార్టీలో కొంతమంది సహచరులు ఉన్నారు. వారితో కలిసి వెళ్లడం కష్టంగా మారింది. అందుకే నేను వైదొలగుతున్నాను. క్రియాశీల ఎన్నికల రాజకీయాలు మాత్రమే వదులుకుంటున్నాను. పార్టీ నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తాను' అని ఆయన తెలిపారు. క్రియాశీల ఎన్నికల రాజకీయాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నానని, పార్టీకి సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. ఇటీవల ఒక ఎన్నికల సభలో సునీల్ జాఖర్ మాట్లాడుతూ అమరీందర్ సింగ్‌ను తొలగించిన తరువాత జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో తనకు 42 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. సిద్ధూకు ఆరుగురు, చన్నీకి ఇద్దరే మద్దతు తెలిపారని గుర్తు చేశారు.